కామం అనగానే చాలా మంది ఆలోచనలు నలుదిశలా పరుగెడుతాయి.మీరనుకున్నట్లుగా కాకుండా ఇందులో భావనలు  చాలా ఉంటాయి. అసలు కామం అంటే కోరిక అని మాత్రమే అర్థం. అంటే ప్రతి మనిషి మనసులో ఇది కావాలి అని కలిగే ప్రతిదీ కూడ కోరికే. అంటే దాని ఉదాహరణకు మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త, బాగా సంపాదించాలి ఇలా ప్రతిదీ కోరికే అంతేగాక మీరు ఊహించుకునే విధంగా శృంగారం ఒక్కటే కామానికి అర్ధం కాదు..


అది ఒక భాగం మాత్రమే అంతే తప్ప కామం అంటే ఏవేవో కాదు. పుట్టిన ప్రతి మనిషికి కోరికలు వుండడం సహజం. కోరికలు ఉంటే ఏమవుతుంది. లేకపోతే ఎలా బ్రతికేది అని చాలా మందికి సందేహం కూడ వుంటుంది. అవును కదండీ మరి. కోరికలు వుండాలి కాని అవి ఒక పరిమితిలో ఉండాలి. అంతే కాని అత్యాశ అతిగా ఉండకూడదు. ఇకపోతే మానవున్ని ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా కామం అడ్డుకుంటుంది. ఈ కామాన్ని జయిస్తే గాని  మనిషి ఆధ్యాత్మికంగా ముందుకు అడుగువేయలేడు..


ఇకపోతే ఈ కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలు అను అరిషడ్వర్గాలను జయించిన వాడు మాత్రమే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి వెళతాడు అన్నది మనకు అన్ని వేద గ్రంధాలలో తెలియచేసినారు. అంతేకాక కామ,క్రోధ,లోభ,మోహ, మద,మాత్సర్యాలలో కూడ మొదట కామం నే తీసుకున్నారు. ఎందుకంటే కామం వెనుక ఉన్నవి అన్నీ కూడా కామం నుండే మరియు కామం వలననే కలుగుతాయి కాబట్టి ఇక్కడ కూడ మొదట కామాన్నే ప్రస్తావించారు.


ఇదే విషయాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ““విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును”.” అంటే కామం వుండడం వలన చాల చాల దుష్ప్రయోజనాలు వున్నాయని తెలుస్తుంది. అదే విధంగా ప్రతివారు  జ్ఞానాన్ని గ్రహించకపోవడానికి, జనన మరణ చట్రంలో ఇరుక్కొని పోవడానికి  కూడ కారణం ఈ కామమే.


అందువలన కామాన్ని అణచివేస్తే గాని మనం మన లక్ష్యానికి దగ్గర అవలేము. కాని కోరికలను ఎలా అణచివేయాలి? కామాన్ని ఎలా జయించాలి? అనే ప్రశ్న ప్రతి మదిలో మెదులుతుంది.  ఇకపోతే కామాన్ని జయించడం అంటే అందరూ అనుకున్నట్లుగా కష్టమైన పనేమీ కాదు. దీనిని జయించడం చాల చాల సులువైన పని. ఎలాగ అంటే మనసుకు  శాశ్వతమైన దానిని తెలియజేసి నిత్యమైన దాని కోసం వెతకడం ప్రారంభిస్తే చాలు.


అప్పటి నుండి మనసు దాని మార్గాన్ని మార్చుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఇంత వరకు అజ్ఞానంలో అనిత్యమైన వాటి కోసం ప్రాకులాడుతున్నాము. కాబట్టి మనస్సు మార్గాన్ని మరల్చాలి. మరల్చి భగవంతుని మీదకు దృష్టి నిలిపేలా మనం గ్రహించిన జ్ఞానంతో మనకు ఉన్న బుద్ది అనే సాధనంతో మనస్సులో కరిగే కోరికలనన్నిటికి స్వస్తి పలికి శాశ్వతమైన, నిత్యమైన, లక్ష్యమైన ఆ పరమాత్ముని దివ్య దర్శనమే ఏకైక లక్ష్యంగా ఉండేలా గాఢమైన కోరికను మన మనస్సులో స్థిరపరచులోవాలి.


ఆ విధంగా స్థిరపరచుకుంటే మన మనస్సులో నిదానంగా అశాశ్వతమైన వాటి మీద ఉన్న ధ్యాస పోయి శాశ్వతమైన పరమాత్మమీద మాత్రమే కోరిక కలుగుతుంది. దీనితో పాటు మనం కొన్నిమంచి అలవాట్లు  ప్రతిదినం అలవరచుకుంటే  సంపూర్ణంగా, పరిపూర్ణంగా కామాన్ని జయించినట్లే.  


మరింత సమాచారం తెలుసుకోండి: