చంద్రుడు చిత్త నక్షత్రంతో ఉంటే చైత్రమని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖమని, అలాగే కృత్తిక నక్షత్రంతో కలిసి ఉంటే కార్తీక మాసం అంటారు. కార్తీకం హిందువులకు అత్యంత పవిత్రమైంది. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ ఎంతో విశేషమైనవి. వీటిలో కార్తీక పూర్ణిమ మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని 'త్రిపురి పౌర్ణిమ', 'దేవ దీపావళి' అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య మర్నాడు కార్తీకమాసం ప్రారంభమవుతుంది. ఆరోజు నుంచి కార్తీకమాసం ముగిసేవరకూ రోజూ సాయంవేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ఈ నెలంతా కార్తీక మహా పురాణ పారాయణం చేస్తారు. ముఖ్యంగా సోమవారాలు, పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. 


కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే తెలిసీ తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. అంతేకాదు సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రం లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నానం ముగించి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు.

కొందరు దీపాలను అరటి దొప్పల్లో ఉంచి నది లేదా చెరువుల్లో వదులుతారు. శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. అలా వీలుకాని వారు ఇంట్లోనే దేవుడి ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే.


 సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఈ రోజు కేదారేశ్వర వ్రతం చేస్తారు. కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: