సంక్రాంతి వచ్చింది తుమ్మెద..సరదాలు తెచ్చింది తుమ్మెద.. అవును నిజమే అప్పుడే పండుగ హుషారు స్టార్ట్ అయింది. భోగి మంటల్లో చలికాచుకోవాలని, సంక్రాంతి సంభరాలు చేసుకోవాలని, కనుమతో పండుగకి ఎలా ఎంజాయ్ చేయాలా అని ఇప్పటికే చాలా ప్లాన్స్ చేసేసుకునుంటారు. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక ఇది. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజులు ప్రతి ఇంటా సంతోషమే. ఇక గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరని చెప్పాలి.
ముఖ్యంగా మొదటి రోజు బోగి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి సంబరాల్లో తొలి రోజును 'భోగి' అంటారు. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. ఇక పాతకు స్వస్తి చెప్పి.. కొత్తకు ఆహ్వానం పలుకుతూ భోగి రోజున ఉదయాన్నే భోగిమంటలు వేస్తారు. పిడకలు, చెట్లు, తాటాకులతోపాటు.. ఇంట్లోని పాత వస్తువులను కూడా మంటల్లో వేస్తారు. అలాగే భోగి రోజు ఖచ్చితంగా పులగం, బెల్లంతో భోజనం, పచ్చిపులుసు, పాలు పొంగిస్తారు. మరియు పరవన్నం.. పచ్చి పులసులో వంకాయ తప్పకుండా వేస్తారు. ఇది పూర్వం నుండీ వస్తున్న సాంప్రదాయం. ఇలా ఆ రోజంతా సాంప్రదాయ వంటలు తింటూ ఎంతో ఆనందంగా ఉంటారు.
అలాగే సాయంత్రం అయితే భోగి పండుగకు చిన్నారులకు తలపై రేగుపళ్ళు పోయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేస్తే.. శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయన్నది ప్రజల విశ్వాసం. మరియు భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు. పన్నెండేళ్ళ లోపు పిల్లలందరికీ తలపై భోగి పండ్లను పోస్తుంటారు. ఇదీ భోగీ పండుగ ప్రాశస్త్యం.