కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు వెంటనే గుర్తొచ్చే తెలుగువారి అతిపెద్ద పండగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే అల్లుళ్లతో, కోడి పందేలతో తెలుగు లోగిళ్లలో సంతోషం నిండుతుంది. సంక్రాంతి పండుగ సమయంలో ఇంటికి కొత్త అల్లుడు వస్తున్నాడంటే ఆ హడావిడే వేరుగా ఉంటుంది. బావా మరదళ్ల సరసాలతో, బావాబావమరుదుల వేళాకోళాలతో ఆ సంతోషం, సరదాలే వేరు.
సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లు అవి కావాలి ఇవి కావాలి అంటూ మామను కోరికలు కోరడం మామ కోరికలు తీర్చకపోతే అల్లుడు అలక పూనడం, మామ అతడిని బుజ్జగించడం, ఆ సందడే కొత్తగా ఉంటుంది. కొందరు మామలు సంక్రాంతి పండుగకు అల్లుళ్లకు బహుమతులు ఇస్తూ ఉంటారు. ఆ బహుమతులు తమకు నచ్చకపోయినా, బహుమతులు తగిన స్థాయిలో లేకపోయినా కూడా అల్లుళ్లు కోపతాపాలకు గురవుతూ ఉంటారు.
మామ అల్లుడికి నచ్చెజెపుతూ అలక తీరుస్తూ ఉంటాడు. తెలుగు రాష్ట్రాలు కోడి పందేలు, ఎడ్ల పందేలు గాలిపటాలను ఎగురవేస్తూ సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని శిఖర స్థాయికి చేరేలా చేస్తారు. సంక్రాంతి పండుగకు జరిగే ఎద్దుల పందేలు తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. సంక్రాంతి పండుగ పల్లె చెంతకు పట్నం చేరుకునే పండుగ. ఈ పండుగకు సరదాగా సమయం గడిపేందుకు నగరాలలో స్థిరపడిన వారు తమ స్వస్థలాలకు చేరుకుంటారు. పండుగ ద్వారా ఏడాదికి సరిపోయే సంతోషాన్ని తీసుకెళుతూ మళ్లీ సంక్రాంతి కోసం ఎదురు చూస్తారు.