సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. మూడు రోజులపాటు భోగి, సంక్రాంతి, కనుమ పేరుతో సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఏపీ ప్రజలు మాత్రం దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఈ వేడుకలు జరుపుకునేందుకు సొంత ఊళ్లకు వచ్చేస్తారు. పాడి పంటలు వచ్చిన సంతోషంలో రైతులు కూడా ఆనందోత్సాహాలతో ఉంటారు. ఇక సంక్రాంతి వచ్చిందంటేనే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. వాటిని ధరించి చూడముచ్చటగా అలంకృతమైన ఆడపడుచులు కనివిందు చేస్తారు.
మరోవైపు సంక్రాంత్రి అంటే కోడి పందేలు, కోడి పందాలు అంటేనే సంక్రాంత్రి అన్నట్టుగా ఉంటాయి. కోస్తా జిల్లాలు. సంక్రాంతి సంబరాలకు ఉభయగోదావరి జిల్లాలు పెట్టింది పేరు. సందడి సందడిగా జరిగే పండుగలో కోడిపందాల జోరు అంతా ఇంతా కాదు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగనున్నాయి. భోగి, సంక్రాంతి, కనుక మూడు రోజుల్లో నిర్వాహకులు పందేలను సాఫీగా సాగించేందుకు సిద్ధపడుతున్నారు.
ఈసారి ఏ గ్రామంలో చూసినా వందల సంఖ్యలో కోడిపుంజులు సమరానికి సై అంటున్నాయి. కోడిపుంజులను వస్తాదుల్లా తయారు చేసున్నారు పందాల రాయుళ్లు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు జిల్లాల్లో కోళ్ల పందేలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో వాటిని చూసేందుకు వచ్చే అతిథుల కోసం ముందుగానే అన్ని హోటళ్లు, లాడ్జ్‌లు బుక్కయిపోయాయి. ఫలితంగా ఆయా హోటళ్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.