నేడు సంప్రదాయాల కన్నా కూడా అట్టహాసాలకు ప్రాధాన్యం పెరిగిపోయిన నేపథ్యంలో ఏ పండుగను ఎలా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రతి పండుగకు వివరణ పెరిగిపోయింది. సంక్రాంతి నాడు పితృదేవతలకు ఎలా కొత్త బట్టలు పెట్టుకుంటామో.. కనుమ కూడా పితృదేవతల ఆరాధనా పండుగే.
అయితే, ఈ కనుమరోజు.. పితృదేవతలతో పాటు పశుపక్ష్యాదులను పూజించాలనే వైశిష్య్టం ఉంది. పితృదేవతలకు ఇష్టమైన ఆహారాన్ని వండి వారికి నైవేద్యంగా సమర్పించాలి. అదే విధంగా పశుపక్ష్యాదులను శుభ్రంగా కడిగి.. వాటిని పూజించి, వాటికి కడుపు నిండా ఆహారం అందించాలి.
మన వ్యవసాయం పశువులతో ముడిపడి ఉంటుంది. వాటి సాయంతోనే రైతులు ఆరుగాలం కష్టించి పంటలను పండిస్తుంటారు. సుఖసంతోషాలతో ఉంటారు. మరి ఇంతటి మేలు చేస్తున్న పశువులకు కృతజ్ఞత తెలుపుతూ పూజించడానికి ఉద్దేశించిందే కనుమ.
ఈ కనుమ పండుగ రోజు అన్నదాతలు తమ పశువుల్ని శుభ్రంగా కడిగి కొత్త మువ్వలు కట్టి వాటిని ముస్తాబు చేస్తారు. పశువులను పూజించి ఇష్టమైన ఆహారం పెడతారు. కొన్ని ప్రాంతాల్లో కనుము తరవాతి రోజును ముక్కనుముగా నిర్వహిస్తారు.