ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వీరి సౌకర్యం కోసం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి మేడారం వరకు హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించారు. రాష్ర్ట పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ ప్యాకేజీలో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం, మేడారం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టు వరకు హెలికాఫ్టర్ సేవలను అందించనున్నారు.
కాగా ఇందుకోసం అయ్యే చార్జీలను సైతం అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నుండి మేడారానికి ఆరుగు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు రూ. 1.80 లక్షలతో పాటు జీఎస్టీ సైతం ఉంటుందన్నారు. విమాన సర్వీసులతో పాటు సమ్మక్క, సారలమ్మ దర్శనం కల్పిస్తామని, అదనంగా రూ. 2999 చెల్లిస్తే మేడారం జాతర వ్యూను హెలికాప్టర్ ద్వారా చూసేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలనుకునే వారు 94003 99999 నంబర్లో సంప్రదించవచ్చని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక రైళ్లు కూడా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ వో రాకేశ్ చెప్పారు. సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి వరంగల్‌కు రైళ్లు నడుపుతామన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్-వరంగల్ (07014/07015) స్పెషల్ ట్రైన్ ఈ నెల 4వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 3.40 గంటలకు వరంగల్ చేరుకుంటుందని చెప్పారు. తిరిగి అదేరోజు సాయంత్రం 5.45కు వరంగల్ నుంచి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుందన్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ (07017/07018) స్పెషల్ ట్రైన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు బయల్దేరి ఉదయం 9.30 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు ఉదయం 11 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది.