చంద్రుడు పరమ పతివ్రత అనసూయాదేవి కుమారుడు మరియు దత్తాత్రేయునికి సోదరుడు. స్వయంగా మహాశక్తిసంపన్నుడైన చంద్రుడు భూమి మీద ఉన్న ఔషధాలకు అధిపతిగా ఉండేవాడు. చంద్రుడు మనిషి మనస్సును శాసించే స్థానాన్ని కూడా పొందాడు. బ్రహ్మకుమారుడైన దక్షుడు తన 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. దక్షుడు చంద్రున్ని 27 మంది కుమార్తెలకు సమానపైన ప్రేమను పంచాలని కోరగా చంద్రుడు అందుకు సరేనని అంగీకరించాడు.
 
దక్షుని 27 మంది కుమార్తెలతో అంగరంగవైభవంగా చంద్రుని వివాహం జరిగింది. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. కానీ చంద్రుడు రోహిణి అనే భార్యపై ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉండటంతో ఆ విషయాన్ని మిగతా భార్యలు దక్షునికి తెలియజేశారు. ఆగ్రహానికి గురైన దక్షుడు చంద్రున్ని పిలిపించి మందలించినా చంద్రుని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు చంద్రుని వెలుగు రోజురోజుకు క్షీణిస్తుందని శాపం పెట్టాడు. 
 
చంద్రుని శక్తి రోజురోజుకు క్షీణిస్తూ ఉండటంతో చంద్రుడు శాప విమోచనం కోసం శివుని చెంతకు చేరాడు. శివుడు దక్షుని శాపం కారణంగా చంద్రుడు పక్షం రోజుల పాటు క్షీణించక తప్పదని లోక కళ్యాణం కోసం మిగిలిన పక్షం రోజులు మాత్రం వెలుగు సంతరించుకుంటాడని తెలియజేశాడు. పరమేశ్వరుని వద్ద ఉంటే కొంతైనా శాప విమోచనం పొందే అవకాశం ఉందని చంద్రుడు శివుని తలపై ఉండిపోయాడు. 
 
శివుని శిరస్సుపై చంద్రుడు ఉండటానికి మరో కథ కూడా ప్రచారం ఉంది. దేవ గురువైన బృహస్పతి భార్య తార చంద్రుని మోహంలో పడి చంద్రుని దగ్గరే ఉండగా పరమశివుడు చంద్రునితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో చంద్రుడు ఓడిపోవడంతో ఆ సమయంలో విజయానికి గుర్తుగా చంద్రుని చిహ్నాన్ని శివుడు ధరించాడని అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: