మహాశివరాత్రి ఒక హిందువుల పండుగ. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఇది హిందువులకు ముఖ్యంగా, శైవులకు అత్యంత పుణ్య ప్రదమైన రోజు. మహశివరాత్రిని హిందువులు ఏంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివున్ని కొలిచి తరిస్తారు. పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది.
అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. అలాగే శివపార్వతుల కల్యాణం కూడా ఈ రోజే జరిగిందని నమ్ముతారు. అంటే సతీదేవి అగ్నిప్రవేశం తర్వాత హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది. ఆ తర్వాత శివుని కోసం ఘోర తపస్సు చేసి భర్తగా పొందింది. ఇక మహాశివరాత్రి నాడు శివపురాణాన్ని చదివితే ముక్తి లభిస్తుందని పురాతన పండితులు పేర్కొన్నారు. శివపార్వతుల గురించి తెలిపే ఈ పవిత్ర గ్రంథాన్ని చదివినవారికి, విన్నవారికీ పుణ్యం కలుగుతుందట. శివరాత్రి రోజు వేకువనే నిద్రలేచి తల స్నానం చేసి శివుడికి పాలు, పెరుగు, తేనే, నెయ్యి, బిల్వ పత్రాలు, పార్వతి దేవికి ఎరుపు జాకెట్టు, గాజులు సమర్పించాలి.
శివ పురాణం ప్రాసస్త్యాన్ని షౌనికాది మునులకు సూత మహర్షి తెలియజేసినట్లు అథర్వణ వేదంలో తెలియజేశారు. ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని ఆయన తెలిపాడు. శివపురాణంలోని నియమాల ప్రకారం ఈశ్వరుడుని పూజిస్తే భక్తులను అనుగ్రహిస్తాడని పేర్కొన్నారు.
అతిథులను ఆహ్వానించి మంచి గడియల్లోనే దీన్ని చదవడం ప్రారంభించాలి. అలాగే పరిశుభ్రమైన, పవిత్రమైన ప్రదేశంలోనే కూర్చోవాలి. పూజ గది లేదా ఇంట్లోని ఓ ప్రదేశాన్ని ఆవు పేడతో శుద్ధిచేసి అక్కడ చదవాలి. శివలింగం పక్కనగానీ, శివాలయంలో అయితే మరీ మంచిది.