టీటీడీ ట్రస్ట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ తీసుకున్న నిర్ణయం తెలిసిన శ్రీవారి భక్తులు షాక్ అవుతున్నారు. టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి...? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు టీటీడీ ట్రస్ట్ బోర్డ్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో బృందం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. 3309 కోట్ల రూపాయల అంచనాలతో టీటీడీ 2020 - 2021 సంవత్సరం బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
అలిపిరి - చెర్లోపల్లి రోడ్డులో 16 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 14 కోట్ల రూపాయలతో జూపార్కు దగ్గర టాలెంట్ ఉన్నవారికి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. 3.3 కోట్ల రూపాయలతో థర్మో ఫ్లూయిడ్ స్టవ్ లను ఏర్పాటు చేసి బూంది పోటులో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. బర్డ్ ఆస్పతి అభివృద్ధికి 8.5 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది.
భక్తుల సౌకర్యాలు మెరుగుపడేలా పలు నిర్ణయాలు తీసుకున్న టీటీడీ అలిపిరి టోల్ గేట్ దగ్గర టోల్ రుసుం పెంచాలని నిర్ణయించి భక్తులకు షాక్ ఇచ్చింది. టీటీడీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై భక్తుల నుండి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీటీడీ గరుడ వారధి పిల్లర్లపై శ్రీవారి నామాల ముద్రణ నిలిపివేసినట్టు ప్రకటన చేసింది. చెన్నైలో దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించి, నిధులను కేటాయించటానికి బృందం ఆమోదం తెలిపింది.