దుర్యోధనుడు.. మహాభారతంలో ఈ పేరు ఖచ్చితంగా వినే ఉంటారు. నిలువెత్తు అహంకారం, అధికారం కోసం ఎంతకైనా తెగించే తత్వం, ఆస్తి కోసం బంధువులని చంపే క్రూరత్వం... ఇలాంటి లక్షణాలు ఇప్పుడు చాలామందిలోనే కనిపిస్తున్నాయి. కానీ మనుషులు ఇలా కూడా ఉంటారు అనేందుకు వేలసంవత్సరాల క్రితమే రుజువు కనిపిస్తుంది. ఆ పాత్రే దుర్యోధనుడు. ఈయన పేరు చెప్పగానే అతి భయంకరుడు, నీచుడు, దుర్మార్గుడు ఎత్తుకి పై ఎత్తులు వేసే దుష్టిడిగా చెప్పుకుంటారు. అలాంటి దుర్యోధనుడికి ఆలయం కూడా ఉంది. అది కూడా మన దేశంలోనే కావడం వేశేషం. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో పోరువలి అనే చిన్న గ్రామంలో మలనాడపై ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. భారత దేశంలోనే ఏకైక దుర్యోధనుని ఆలయంగా మలనాడు దేవాలయం విరాజిల్లుతోంది.
అయితే మహాభారత కథ ఆధారంగా దుర్యోధనుడికి ఆలయాన్ని నిర్మించి అక్కడ దేవునిగా పూజలు అందుకుంటున్నాడంటే చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఆలయం వెనుక పెద్ద చరిత్రే ఉంది. కౌరవులతో జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్నీ, ఏడాది అజ్ఞాతవాసాన్నీ అనుభవించేందుకు సిద్ధపడిన విషయం గుర్తిండే ఉంటుంది. పాండవులు తమ అరణ్య వాసం పూర్తి చేసుకుని అజ్ఞాత వాసంలో ఉన్న సమయంలో వారిని పట్టుకునేందుకు ధూర్యోధనుడు, శకుని వేయని పధకాలు ఉండవు.
అజ్ఞాత వాసంలో ఉన్న పాండవులను పట్టుకుంటే వారు మరో 12 ఏళ్లు అజ్ఞాత వాసం చేయాల్సి ఉంటుంది. అందుకే పాండవుల జాడ కనుగొనేందుకు దుర్యోధనుడే స్వయంగా వారిని వెతుక్కుంటూ బయలు దేరతాడు. అలా వెళ్లిన దర్యోధనుడు కేరళలోని మలనాడు ప్రాంతానికి చేరుకున్నాక అలసిపోయి అక్కడే సేద తీరుతుండగా.. అక్కడి స్థానికులైన కురువలు స్వాగతం పలికి చల్లటి కల్లుతో దాహం తీర్చారు. అప్పుడు దుర్యోధనుడు కృతజ్ఞతగా తన రాజ్యంలోని ఆ ప్రాంతాన్ని అక్కడి వారికి కానుకగా ఇస్తాడు.
దీంతో కురువ జాతికి చెందిన పూర్వీకులు మలనాడ కొండపై దుర్యోధనుడికి ఆలయం కట్టించినట్లు చెబుతారు. కాకపోతే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు. గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది. గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని ఊహించుకుంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. దుర్యోధనుడికి కల్లుని నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా.. ఆయన దర్శనానికి వచ్చినవారికి కల్లును తీర్థంగా కూడా ఇస్తారు.