
హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగిన ఆ ఆంజనేయ స్వామి హైందవులకు పరమ పూజనీయుడు. తన యొక్క భక్తిప్రపత్తులతో రాముని గుండెలలో దాచుకున్న మహానుభావుడు హనుమంతుడు. హనుమంతుడు శ్రేష్ఠమైన ధైర్యం మరియు బలాన్ని కలిగి తన భక్తులకు ఎల్లప్పుడు అండగా ఉంటాడని ఎంతో మంది విశ్వసిస్తుంటారు. ఇక దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆంజనేయ విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అని అంటున్నారు.
అసలు ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు..? అన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీని వెనక ఓ కారణంగా ఉంది. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించిన సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయడపడుతోన్న హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు. అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలదేరుతాడు. అయితే అదే సమయంలో సీతమ్మ ఆంజనేయుడిని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తుంది. కానీ, అక్కడ చుట్టుపక్కలా ఎక్కడా కూడా సీతమ్మకి పుష్పాలు దొరకకపోవడంతో.. పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి, ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది.
అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే ప్రీతిపాత్రమైనది. అంతేకాదు, సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ.. ఆకాశంలో పయనిస్తూ, గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు.. ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకుంటారు. దీంతో వానరులంతా హనుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇక అప్పట్నుంచీ అంజని పుత్రుడికి తమలపాకులు అత్యంత ప్రీతిపాత్రమైపోయాయి. అందుకే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటుంటారు.