తిరుమల పుణ్యక్షేత్రాన్ని కలియుగ వైకుంఠమని భక్తులు పిలుస్తూ ఉంటారు. స్వయంభువుగా వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏడుకొండలవాడని, సప్తగిరీశుడని, శ్రీనివాసుడని, తిరుమలప్ప, తిమ్మప్ప, బాలాజీ అని రకరకాల పేర్లతో భక్తులు పిలుస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారు ఉత్సవ ప్రియుడు, సంకీర్తనా ప్రియుడు, అర్చన ప్రియుడు, నైవేద్య ప్రియుడు కూడా. తిరుమల శ్రీవారి విశేషాలను శ్రీవారి ప్రధాన అర్చకుడు శ్రీ రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే పుస్తకం ద్వారా భక్తులకు తెలియజేశారు. 
 
రమణ దీక్షితులు పుస్తకంలో స్వామి వారికి బియ్యం, ధాన్యాలు, ఆవుపాల పదార్థాలు, ఔషధగుణాలున్న వస్తువులు, వనస్పతులు, లవంగాలు, యాలకులు, తులసి,మిరియాలతో ప్రసాదాలను తయారు చేస్తారని చెప్పారు. హింసలేని ప్రపంచాన్ని కోరుకున్న మహర్షులు నిర్దేశించిన ప్రసాదాలు ఇవి అని అన్నారు. ప్రసాదం అంటే ఆకలి తీర్చే ఆహారం కాదని.. పవిత్రంగా పరిమితంగా స్వీకరించవలసిన పదార్థం అని చెప్పారు. 
 
ఈ అంశాలను భక్తజనానికి వివరించడమే ఈ పుస్తక పరమోద్దేశం అని చెప్పారు. తన అనుభవాలను ఈ పుస్తకంలో రాశానని... ఈ పుస్తకంపై వచ్చే రాయల్టీని తిరుమలలోని అన్నప్రసాద పథకానికి ఇవ్వాలని సంకల్పించానని చెప్పారు. ప్రపంచంలోని శ్రీవారి భక్తులందరికీ అర్థమవ్వాలనే తొలిగా ఆంగ్లంలో పుస్తకాన్ని విడుదల చేశామని... త్వరలో తెలుగు, తమిళం, హిందీ, ఇతర భాషల్లో విడుదల చేయటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 
 
స్వామి వారికి ప్రతిరోజూ త్రికాల నైవేద్యం ఉంటుంది. తిరుమలలో నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంట పేర్లతో వ్యవహరిస్తారు. గురు, శుక్రవారాలు మినహా మిగతా రోజుల్లో నైవేద్యంలో మార్పు ఉండదు. స్వామి వారికి తొలి నివేదన ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో నివేదన ఉదయం 10 గంటలకు, మూడో నివేదన రాత్రి 7.30 గంటలకు ఉంటుంది. స్వామివారికి సమర్పించే వాటిలో రోజూ ఒకే రకమైన ప్రసాదాలు ఉంటాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: