
హనుమంతుడు.. దేశవ్యాప్తంగా ఈయనకు ఎందరో భక్తులు ఉన్నారు. వేద వేదాంగాలను అభ్యసించిన నవ వ్యాకరణ వేత్త హనుమంతుడు. మహా బలవంతుడు, బుద్ధికుశలుడు, కార్యదక్షుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదనే చెప్పాలి. అవును! దాదాపు ప్రతి గ్రామంలోనూ హనుమంతుడి ఆలయం దర్శనిమిస్తుంది. అలాంటి వాటిలో టోంకినీ అంజన్న ఆలయం కూడా ఒకటి.
కానీ, ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు దాగున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..హనుమాన్ ఆలయం ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్–టీ మండలం టోంకినీలో ఉంది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. పురాతన కాలంలో వార్ధా నదిలో విగ్రహంగా బయటపడి, భక్తులతో నిత్య పూజలు అందుకుంటూ కోర్కెలు తీర్చే కల్పతరువుగా మారాడు. ఆలయానికి సుమారు ఏడు కిలో మీటర్ల దూరంలో వార్ధా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది. ఆలయం ముఖ ద్వారం పడమర వైపు ఉంది. కానీ.. విగ్రహం మాత్రం దక్షిణాభి ముఖంగా ఉంది. అలాగే ఈ ఆలయంలో అంజన్న విగ్రహం పరిమాణం ఏటేటా పెరుగుతుండడం మరో విశేషంగా చెప్పొచ్చు.
అంతేకాదు, ఇక్కడ ఆలయం కట్టకముందు వర్షాకాలం వస్తే చాలు వరదలతో ఆ గ్రామం మునిగిపోయేదట. కానీ.. ఎప్పుడైతే అంజన్న ఆలయం కట్టారో.. అప్పటి నుంచి ఎంత వర్షం వచ్చినా ఊరు మునిగిపోవడం లేదు. ఎంత వరద వచ్చినా నీళ్లు ఆలయం మెట్ల దాకా వచ్చి ఆగిపోతున్నాయని అక్కడ గ్రామస్తులు అంటున్నారు. అలాగే ఇక్కడ అంజన్నకు ముడుపు కడితే కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.. అందుకే ముడుపుల హనుమాన్గా కూడా పిలుస్తుంటారు. మరియు అంజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులంతా కలిసి ప్రతి సంవత్సరం మహా పాదయాత్ర కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ హనుమంతుని మహిమ తెలిసిన భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారట.