
హిందూ పురాణాల్లో హనుమంతుడికి ప్రత్యేక స్థానం అని చెప్పాలి. బలవంతుడు, శక్తి సామర్థ్యాలు, ధైర్యవంతుడు, ఆపాయ్యత, నిజాయితీ, నిజమైన భక్తికి నిదర్శనం హనుమంతుడు. తన ఇష్టాన్ని, తన ప్రేమని, తన భక్తిని, తను అమితంగా ఆరాధించే రాముడిని హృదయంలో నిలుపుకున్న అమిత పరాక్రమవంతుడు. అందుకే హనుమంతుడికి ఉన్న భక్తి పారవశ్యం ఎవరిలోనూ చూడలేం.
రామావతారాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడిని నిస్వార్థంతో ప్రత్యక్షంగా సేవించిన భాగ్యశాలి హనుమంతుడు. అలాగే సమస్త లోకాలకు వెలుగును పంచే సూర్యభగవానుడి ప్రియశిష్యుడుగా కూడా హనుమంతుడు చెప్పబడుతున్నాడు. అందువల్ల హనుమంతుడిని పూజించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా 'కుజదోషం' గలవారు మంగళవారం రోజున హనుమంతుడికి` పూజ చేస్తే దోషం పోయి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
మంగళవారం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి.. శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆపై ఎనిమిది రేకుల తామర పుష్పాన్ని, తమలపాకులు, ఎరుపు రంగు పూలను పూజవద్ద ఉంచాలి. ఎరుపు రంగుతో కూడిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి.. పూజను ముగించాలి.
ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా హనుమంతుడు ప్రీతి చెందుతాడు. తద్వారా కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు. హనుమంతుడి అనుగ్రహముంటే, ఆయురారోగ్యాలతో జీవితం ఆనందంగా సాగిపోతుందని విశ్వసిస్తారు. అలాగే 'శనిదోషం' తో ఇబ్బందులు పడుతోన్న వాళ్లు శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు.