భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు, సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ‘ఉండ్రాళ్ళ తద్ది’. భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ‘ఉండ్రాళ్ళ తద్ది’ ఈ నోముకు ‘మోదక తృతీయ’ అనే మరోపేరు కూడా కొన్నది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంచే ‘తద్ది’ అనుమాట మూడవ రోజు ‘తదియ’ అనే అర్థంతో వాడబడినది కనుక ‘తదియ’, ‘ఉండ్రాళ్ళ తద్ది’గా పిలువబడుతున్నది. ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడోరోజున, అంటే బహుళ తదియన ‘ఉండ్రాళ్ళతద్ది’ నోమును నోచుకోవాలని మన పూర్వలు నిర్ణయించారని, అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఐతహ్యం.
భాద్రపద తృతీయ తిథినాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానమాచరించి, సూర్యాస్తమయము వరకు ఉపవాసం ఉండి, బియ్యపుపిండితో ఉండ్రాళ్ళను చేసి వండి గౌరిదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచార విధిగా పూజ గావించి, ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను వాయనముపై దక్షిణ తాంబూలాలను ఉంచి ఐదుగురు పుణ్యస్త్రీలకు వాయనం ఇవ్వాలి. ఇలా తమతమ శక్తిని బట్టి వాయనంతో చీర, రవికెలను కూడా సమర్పించు కొనవచ్చును. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికి పాదాలకు పసుపు-పారాణి రాసి నమస్కరించి, వారి ఆశీస్సులు పొంది, అక్షతలను వేయించుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ముఖ్యంగా పెళ్ళికాని కన్యలు ఆచరించడంవలన విశేషమైన ఫలితాలను పొందుతారని, మంచి భర్త లభిస్తాడ గొప్ప నమ్మకం ఉంటుంది.

వివాహం కాని ఆడపిల్లలు ఈ రోజు తెల్లవారుజామున తలంటుపోసుకోవాలి. తలంటు అనగానే ఏదో షాంపుతో కాకుండా కుంకుడుకాయల రసంతో తలని రుద్దుకోవాలి. ఆ కుంకుడులోని దేదుతనం క్రిముల్నీ, కీటకాలనీ జుట్టులోనికి రానీయదు. జుట్టులోని తడిని పిడవ (మెత్తని తుండుని చుట్టుకోవడం) ద్వారా బాగా పీల్చుకునేలా చేసుకుని సాంబ్రాణి పొగని పట్టించుకోవాలి. దీంతో జుట్టంతా సువాసనతో నిండడమేకాక, తల తడిసిన కారణంగా శిరోజాల మూలాల వద్ద వున్న తడి పూర్తిగా ఆరిపోతుంది. ఇక గోంగూరపచ్చడితో పెరుగన్నాన్ని తినిపిస్తారు... పిల్లలందరికీ. ఈ తతంగమంతా ఉదయం 06 గంటలకే పూర్తవ్వాలి. ఇక్కడితో ఈ రోజు పండుగ ముగిసినట్లే.

పుట్టిన ప్రతి ఆడపిల్ల మీదా ఒకటి నుండి ఐదో సంవత్సరం వచ్చేవరకూ చంద్రుడు రాజ్యంచేస్తాడట. అందుకే ఆ పిల్లలు బాగా ఆకర్షణీయంగా ఉండాడమే కాక ఎప్పుడూ అలా గుర్తుకొస్తూవుంటారు కూడా. ఏ చంద్రుడు మనస్సుని దృఢం చేస్తుంటాడో ఆ కారణంగా తండ్రి, మామయ, బాబాయి .... ఇలా అందరినీ, మా ఇంటినీ. పొరుగింటినీ కూడా ఇట్టే ఆకర్షించ గలుగుతారు ఈ కాలంలో..  ఆరు నుండి పదో సంవత్సరం వచ్చే వరకూ ఆ పిల్లని చంద్రసాక్షిగా గంధర్వుడు స్వీకరించి రాజ్యం చేస్తాడు. గంధర్వుడు లావణ్యానికి అధినేత కాబట్టి ఆ పిల్లకి అందాన్ని కలిగిస్తాడు . ఆడపిల్లలలో నిజమయిన అందం (ఏ విధమైన దుర్భావకూ లేని అందం ) ఆరు నుండి పడేళ్ళ వరకూ బాగా ఉంటుంది.

ఇక 11 నుండి 15 యేళ్ల మధ్య అగ్నిదేవుడు ఆడపిల్ల బాధ్యతను గంధర్వుని సాక్షిగాస్వీకరిస్తాడు. అగ్నిదేవుడు కామానికి అధిష్టాత కాబట్టి ఆమెలో కామకుణాన్ని 11 వ సంవత్సరం రాగానే ప్రవేశపెడతాడు . _ఈ వయసుకు ముందు వయసులో అనగా 15 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళంతా శారీరకంగా ఆరోగ్యవతులుగా ఉండే నిమిత్తమే ఈ ఆటలూ, ఉండ్రాల వాయనాలు.
మద్యాహ్నం గౌరీ పూజ. గౌరిని షొడశోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు.
 ఐదు దారపు పోగులు పోసి, ఐదు ముడులు వేసి, ఏడుతోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి, మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి, పచ్చి చలిమిడి చేసి, ఐదు ఉండ్రాలను చేసి, నైవేద్యం పెట్టాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథ చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: