
దేవుడికి దీపారాధన చేయడం పూజ చేసే సమయంలో చేస్తుంటాం. ఐతే ఈ దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించాలన్నది చాలామంది భక్తులకు తెలియదు. కానీ దీపారాధనకు ఆవునెయ్యి వాడడం అత్యుత్తమం అని పురాణాలలో చెప్పబడింది. ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.అలాగే మంచి నూనె మధ్యమము. ఇప్పనూనె అధమము అని గుర్తించుకోండి. ఆవు నెయ్యితో వెలిగించిన దీపం యొక్క ఫలితము అనంతము. అంతేకాకుండా ఈ నూనెతో దీపారాధన చేసే వారికి అష్టైశ్వర్యాలు, అష్టభోగాలు సిద్ధిస్తాయని పూర్వీకులు చెబుతుండేవారు. అదేవిధముగా వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. ఒకవేళ మీరు పొరపాటున వేరుశెనగ నూనెతో దీపారాధన చేస్తే ఎంతో కీడు కలుగుతుంది.
వేప నూనె రెండు చుక్కలు ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. అమ్మవారు శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపం అంటే మహా ప్రీతి, మరియు గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము అంటే చాలా ఇష్టము. కాబట్టి భగవంతునికి దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె వాడాలో ఖచ్చితంగా తెలుసుకుని వాడడం శుభప్రదం. దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.