ఇక రెండో వర్గం జంటలు . వీళ్ళు పెళ్ళైన దగ్గరనుంచి చిన్న చిన్న మాట పట్టింపులు, పౌరుషాలతో ఆత్మాభిమానానికి పోయి జీవితాంతం కొట్టుకుంటూ తిట్టుకుంటూ అవసరమైనప్పుడు ప్రేమగావుంటూ జీవిత నావని సాగిస్తూనే వుంటారు . సాధారణంగా వీరి మధ్య గొడవలు అత్తామామలని సరిగా చూడలేదనో, మగని మనసు తెలిసి మసలటం లేదనో, ఆడపడుచులు వచ్చినప్పుడు గౌరవంగా చూడటం లేదనో ఇలా భర్త వైపునుంచి; ఎంతసేపూ నీ తమ్ముడు, నీ అన్నయ్య అంటూ నీ వాళ్ళ గురించి పట్టించుకుంటావ్ కాని పెళ్ళాన్ని; నీకు జీవితాంతం సేవ చేసే భార్యని ఇంట్లో ఒకదాన్ని వున్నానని నన్ను పట్టించుకున్నావా, ఏనాడైనా మా అమ్మ నాన్నలకి గౌరవం ఇచ్చావా, నా మనసేంటో తెలుసు కున్నవా, డబ్బంతా మీ వాళ్ళకే పెడితే మన పిల్లల సంగతి ఏమికాను అంటూ భార్య వైపు నుంచి; ఇలా వీళ్ళ లైఫ్ అంతా పంతాలు పట్టింపులతోనే గడుస్తుంది. ప్రేమ ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు. కాని సమాజం కోసమో, కుటుంబ గౌరవం కోసమో, నాకో తోడూ లేకపోతే నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలోని భయంవల్లనో, వారికున్న సంస్కారం వల్లనో వీళ్ళు కలిసేవుంటారు. విడిపోవాలన్న ఆలోచనే ఉండదు.
పెళ్ళైన మరుక్షణం నుంచి వీళ్ళ మధ్య గొడవలు మొదలు. భర్త మనసు భార్య, భార్య మనసు భర్త అర్థం చేసుకోవడం అనే మాట పక్కన పెట్టి ఒకరి మాట ఒకరు విని అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. అసలు వినే ప్రసక్తే లేదు . ఎప్పుడూ లోపాలు వెతుకుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జంటల గొడవల్లో ప్రధానమ్శాలు రెండు ప్రేమ,గౌరవం. నన్ను ప్రేమగా చూసుకోవటం లేదని భార్య , నువ్వు నాకు మర్యాద ఇస్తే నీకు ప్రేమ దక్కుతుందని భర్త. ఈ గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి, ఆ గాలివానకి ఉరుముల్లాగా వీళ్ళ తరపు పెద్దలను కూడా కలుపుతారు. అసలు గొడవలు మొదలయ్యేది ఇక్కడే. మాలో మేం ఎన్ని గొడవలు పడినా అది పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్ల కూడదు అని వీళ్ళకి ఏనాడు అనిపించదు. భర్త ఇంట్లోలేని సమయం చూసి "అమ్మా మా ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు మన నాన్నలాగ నన్ను జాగ్రత్తగా చూసుకోవటం లేదు. బొత్తిగా జాగ్రత్త లేని మనిషి, అస్తమాటు ఫోన్ లో మీ వాళ్ళతో ఏంటి మాటలని విసుక్కుంటున్నాడు" ఇలా భార్య మొదలెడుతుంది.