సాధారణంగా కార్తీక మాసం, శ్రావణ మాసాలలోనే ఎక్కువగా పూజలు పురస్కారాలు జరుగుతుంటాయి. అలాంటి ప్రత్యేకతే ధనుర్మాసం కూడా కలిగి ఉంది అంటూ చెబుతున్నారు వేదపండితులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... ఈ మాసం మన ఆకాంక్షలను నెరవేర్చే మాసంగా చెబుతున్నారు. ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నాన మాచరించి, ఇంటిని శుభ్రపరుచుకుని , దీపారాధన చేయాలి అదే విధంగా సాయంత్రం పూట కూడా ఇలానే పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మీ దేవి, విష్ణుమూర్తి కరుణ కటాక్షాలు లభించడంతో పాటు.. పెళ్లికాని వారు ఈ సమయంలో చేసే వ్రతాల వల్ల వారి కలలన్నీ తీరుతాయని శాస్త్రం చెబుతోంది.
ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో వ్రతాలు చేస్తే ఆ శ్రీ మహా విష్ణువు వరాలు కనిపిస్తాడని ప్రసిద్ధి. ఎందుకంటే శ్రీమహావిష్ణువుకు ధనుర్మాసం అంటే ఎంతో ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో ఆయన్ని పూజించడం వల్ల ఆ తండ్రి కటాక్షం పొందవచ్చని చెబుతున్నారు. ధనుర్మాసం దేవతలకు కూడా బ్రహ్మ ముహుర్తం లాంటిది అని శాస్త్రం తెలుపుతోంది. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ఈ కాలంలో దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు వంటివి నిర్వహిస్తారు. ధనుర్మాసంలో పూజలు, వ్రతాలు, హోమాలు వంటివి చేయడం వలన మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలా ధనుర్మాసం అన్ని రకాల అనువైంది అని మన శాస్త్రం చెబుతోంది.