
దక్షిణ భారత ఆలయాల మీద దేవతలు లేదా జంతువులతో చిత్రాలు చెక్కబడ్డాయి. హిందూ మత పురాణంలో జంతువులను ప్రత్యక్షంగానూ లేదా దేవుళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రతీతి. కొన్ని రకాల జంతువులను కొందరు హిందూ దేవుళ్ళకు వాహనాలుగా పేర్కొన్నారు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. ఎద్దు లేదా బసవన్న(నంది): శివుడి యొక్క సంరక్షకుడు మరియు వాహనంగా చెబుతున్నారు. శివుని వాహనంగా నంది ఉంటుందని ప్రసిద్ధి. శివాలయము నందు మరియు ప్రతి హిందూ దేవాలయము నందు దేవునికి అభిముఖముగా వున్న ఎద్దు ఆకారమే 'నంది'. దేవాలయాల్లో నంది విగ్రహం దేవునికి ఎదురుగా ఉంచుతారు. కొమ్ముల మద్య నుండి భగవంతుడిని చూచిన భగవంతుని కృప కలుగునని ప్రతీతి.
అదేవిధంగా నంది చెవిలో మన కోరికలని చెబితే అవి నేరుగా దేవునికి చేరుతాయి అని ఒక నమ్మకం. ఎలుక గణేశుని వాహనం: ఇది అందరికీ తెలిసిన విషయమే. వినాయక చవితి నాడు గణేష్ విగ్రహం ముందు ఎలుక చిన్న విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించి పెడతారు. కొన్ని చోట్ల ఎలుకపై వినాయకుని కూర్చున్నట్లు విగ్రహాన్ని తయారు చేసి వినాయక చవితి నాడు ప్రతిష్టిస్తారు. పులి: హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత పార్వతీ దేవి. పులి దుర్గా దేవికి వాహనం. కొన్ని సందర్బాల్లో సింహంగా కూడా చూపెడుతుంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి బాహుబలసాలి అయిన పులిని వాహనంగా చెబుతుంటారు.
బ్రహ్మ దేవుని వాహనం హంస. చదువుల తల్లిగా ప్రసిద్ధిచెందిన తల్లి సరస్వతి దేవి. దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. సరస్వతి మాతకు హంస మరియు మయూరిలను వాహనాలుగా చెబుతుంటారు.
అన్నిపక్షులకు గరుడు అధిపతి. శ్రీ మహావిష్ణువుకి గరుడ వాహనం గా చెప్పబడుతోంది. మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనుడైన గరుడభగవానుడిని దర్శించుకోవడం ద్వారా జీవితం సర్వ సంతోషాలతో వెలిగిపోతోందని అంటారు. దేవుళ్లకు అధిపతి అయిన ఇంద్రుడి యొక్క వాహనం ఏనుగు. దీనిని ఐరావతం అని అంటారు. సూర్య దేవుని వాహనం అశ్వం అనగా గుర్రం. శనీశ్వరుని వాహనం కాకి అని పురాణాలు చెబుతున్నాయి. శనీశ్వరుని దివ్య చరిత్ర కూడా అందరికీ తెలిసే ఉంటుంది. సూర్య భగవాన్ కి, ఛాయా దేవి కి కలిగిన పుత్రుడే శనీశ్వరుడు. ఇలా దేవుళ్ళకు వారి వారి గొప్పతనాన్ని బట్టి వాహనాలు ఉన్నాయి.