
రాజకీయ నాయకులు, కొందరు సెలబ్రెటీలు సైతం సాధువుల్ని ఆశ్రయించి తమ కోరికలను విన్నవించుకుంటుంటారు. కొన్ని సందర్భాలలో సాధువుల్ని కలుసుకోవడం మహాత్యాలు చూచి, నమ్మి వారికి జేజేలు పలుకుతుంటారు. చదువుకున్న వారు సైతం ఇటువంటి వారి కాళ్లపై పడి మొక్కుకుంటారు. కానీ ఈ మహాత్యాల వెనుక ఏముంది, ఎలా ఈ మహిమలన్నీ వారు చేయగలుగుతున్నారు అని తెలుసుకోడానికి ఎవరూ ప్రయత్నించరు. వాస్తవానికి వీటన్నిటి వెనుక సాధారణ ప్రజలకు తెలియని సైన్స్ దాగి ఉంది. ఉదాహరణకు..'దివ్యదృష్టి' గురించి మాట్లాడితే...మనిషి ప్రాణవాయువు పీల్చడం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఒకవేళ ప్రాణవాయువు తీసుకోకపోతే మనిషి ప్రాణానికే ప్రమాదం. మనం శరీరంలోకి పీల్చుకొనేది ప్రాణవాయువు అయితే తిరిగి వదిలేది బొగ్గుపులుసు వాయువు.
బాబాలు, సాధువులు, రుషులు వూపిరి బిగబడతారు. దీనిపై ఎంతో అభ్యాసం చేస్తారు. యోగాలో ఇదొక భాగం. బొగ్గుపులుసు వాయువు ఎక్కువసేపు వూపిరితిత్తులలో, రక్తంలో అట్టిపెడితే, మెదడుకు చాలినంత ప్రాణవాయువు అందదు. మెదడు సాధారణంగా పనిచేయాలన్నా ముఖ్యంగా ఆలోచించాలన్నా ప్రాణవాయువు కీలకం. కృత్రిమంగా మెదడుకు ప్రాణవాయువు తగ్గిస్తే ఆలోచన కూడా తగ్గుతుంది. తొలిదశలో రకరకాల పగటి కలలు, దృశ్యాలు, అర్థం పర్థంలేని ఏవో దృష్టులు కళ్ళముందు కదులుతాయి. అదొక లోకం. కళ్ళు మూసుకొని ప్రాణాయామం ఆచరించేవారికి వింత వింత దృశ్యాలు, తమకు తెలియని లోకాలు కనిపిస్తాయి.
ఇలాంటి వాటిని అడ్డుపెట్టుకొని కొందరు బాబాలు సాధువులు వారికి దైవ శక్తి ఉన్నట్టు ప్రజలను నమ్మిస్తుంటారు. ఇలా ఎన్నో వింతలను మహిమలను చూపి ప్రజలను ఆకర్షిస్తుంటారు. అది తెలియని అమాయక ప్రజలు అటువంటివారి చుట్టూ తిరుగుతూ మొక్కుకుంటారు. కానీ వీటన్నిటి గురించి అవగాహన పొందడం ఎంతో అవసరం. ఇలా అన్నింటినీ గుడ్డిగా నమ్మకూడదు. ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి. దైవభక్తి ఉండొచ్చు కానీ... ఇలా అన్నిటిని నమ్మకూడదు. అలా అని అందరూ బాబాలు సాధువులు ఇలాంటి వారే అని చెప్పలేం. కొందరు ఆ దేవుడిని పూర్తిగా విశ్వసిస్తూ సన్మార్గంలో ప్రయాణిస్తుంటారు. కానీ వింతలు మహిమలు అంటూ ప్రజలను ఆకర్షించే వారిని నమ్మడం కరెక్ట్ కాదు. మనం చేసే ప్రతి మంచి పనిలోనూ దైవత్వం దాగి ఉంటుంది. కనుక నలుగురికి సహాయం చేస్తూ.. మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి అనుకున్న వాటిని మనమే సాధించుకోవాలి