
శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఈరోజే. ప్రకృతి పరంగా కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచి ప్రారంభం అవుతాయి. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి. మల్లెలు, మామిడి పిందెలు, వేపపూత.. అన్నీ ఉగాదికి సిద్దం అవుతాయి, ఒక్క తెలుగు సంప్రదాయం లో కాకుండా మరాఠీలు గుడి పడ్వా, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పాయ్‌లా బైశాఖ్ అనే పేరుతో ఈ ఉగాదిని జరుపుకోవడం విశేషం.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉగాది పండుగను పిలుస్తారు.. జరుపుకుంటారు. ఉగాది పచ్చడి షడ్రుచుల కలయిక. ఎక్కడైనా ప్రకృతిలోని మార్పులు ఎంత సహజమో జీవితంలో కష్టసుఖాలు అంతే సహజం అని ప్రకృతి సాక్షిగా చాటిచెప్పడం ఉగాది పండుగ ముఖ్య ఉద్దేశం. ఇక ఉగాది పచ్చడి మహా ఔషధం అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడిని శ్రీరామ నవమి వరకు లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజూ తీసుకోవాలట. అంటే 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అదేనండీ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెబుతూ ఉంటారు. అలా తీసుకుంటే అది ఇమ్యూనిటీ బూస్టర్ లా పని చేస్తుందట.