కుటుంబంలో మరణించిన వారిన మర్చిపోలేని వారు.. తమ పెద్దల దీవెనలు ఎల్లప్పుడూ తమతో ఉండాలని ఇళ్లలో ఆలా ఫోటోలను ఉంచుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ఫోటోలను ఏ విధంగా పెట్టాలి..? ఏ దిక్కున ఉంచాలి..? ఒకవేళ ఉంచకూడని వైపు ఉంచితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి..? అనే విషయాలను పండితులు వివరిస్తున్నారు. అంతేకాకుండా మరికొందరు చనిపోయిన వారి ఫోటోలను దేవుడి గదిలో దేవుడి ఫోటోలతో పాటు ఉంచుతారు. అలా ఉంచడం గురించి కూడా పండితులు హెచ్చరిస్తున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం.. మరణించిన వారి ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ గోడకు వేలాడదీయ కూడదట. ఆ ఫోటోలను ఏదైనా చెక్క బల్లపై లేదా స్టాండ్‌పై ఉంచాలట. అలాగే ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కువగా ఉండకూడదు. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో అడుగుపెట్టగానే కనపడే విధంగా పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య, లేదా కుటుంబ సభ్యులకు వేరే వారితో కలహాలు ఏర్పడే ప్రమాదం ఉందని వాస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలను ఉంచడం పూర్తిగా తప్పని, అలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడు ఆందోళనలు, కలహాలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా బెడ్ రూం లో కూడా చనిపోయిన వారి ఫోటోలను పెట్టకూడదట. ఇక బతికున్న వారి ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన వారి ఫోటోల పక్కన ఉంచకూడదని, అలా ఉంచడం వల్ల బతికున్న వారి ఆయుష్షు క్షీణిస్తుందని పండితులు చెబుతున్నారు.
కాగా.. చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడు, ఎలా, ఏ దిక్కున ఉంచాలి అనే విషయాలపై కూడా శాస్త్రవేత్తలు క్లారిటీ ఇస్తున్నారు. మరణించిన వారి ఫోటోలు హాలులో ఉత్తర దిశ వైపు పెట్టవచ్చని, ఈ విధంగా పెట్టడం ద్వారా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తగ్గుతుందని చెబుతున్నారు. ఉత్తర దిశ నెగెటివ్ ఎనర్జీని తగ్గిస్తుందని, దానివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని, కుటుంబ సభ్యులు కూడా ప్రశాంతంగా, ఆనందంగా జీవించగలుగుతారని తెలియజేస్తున్నారు.