అరుణాచలంలోని ఆశ్రమంలో రమణ మహర్షిని సందర్శించేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా చాలా మంది వచ్చేవారు. స్థానిక భక్తులు, సిబ్బంది ఆచారాల పేరుతో అక్కడకు వచ్చేవారికి కఠిన నిబంధనలు పెట్టేవారు. ఇవి మహర్షి దృష్టికి కూడా వచ్చేవి. ఓసారి ఒక అమెరికా భక్తురాలు అరుణాచలం వచ్చారు. భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు అంతగా తెలియని ఆమె మహర్షి ఆశీనులయ్యే చోట కుర్చీలో కూర్చున్నారు. ఆమెకు కీళ్ల నొప్పులు ఉండడంతో కాళ్లను చాచి కూర్చున్నారు.
దీంతో ఆశ్రమ సిబ్బంది ఆమెను మందలించబోయారు. అప్పుడు రమణులు వారిని వారించారు. ఈ సందర్భంగా పెరియ పురాణంలోని ఓ శివ భక్తురాలి కథను చెప్పారు...
ఆమె పరమ భక్తురాలు.. ఆమెనేమీ అనకూడదు!
అవ్వయ్యార్ అనే భక్తురాలిని గణపతి సశరీరంగా కైలాసానికి తీసుకెళతారు. ఆమె బాగా వృద్ధురాలు కావడంతో కాళ్లు మడిచి కూర్చోలేక శంకరుడి ముందు కాళ్లు చాపి కూర్చుంది. ఆమె వైఖరి చూసి పరమేశ్వరుడి పక్కన ఉన్న పార్వతి మనసు చివుక్కుమంది. అలా కూర్చోవడం అపరాధం కదా... ఆమెకు ఓ సారి చెప్పమని భర్త అయిన శంకరుణ్ణి కోరింది. ‘ఆమె పరమ భక్తురాలు ఆమెనేమీ అనకూడదు’ అంటూ శివయ్య మౌనం దాల్చారు. పరమేశ్వరి ఊరుకోలేదు. తన చెలికత్తెకు చెప్పి పంపింది.. అమ్మవారి సఖి ఆ వృద్ధురాలిని సమీపించి ‘అవ్వా నీ కాళ్లు ఈశ్వరుడివైపు పెట్టకు’ అంది.
ఈశ్వరుడు లేని చోటెక్కడో చెప్పు?
అప్పుడామె ‘అలాగా అమ్మా! ఈశ్వరుడు లేని చోటెక్కడో చెప్పు.. కాళ్లు అటు పెట్టుకుంటాను’ అంటూ కాళ్లను పక్కకు తిప్పింది.
వెంటనే పరమేశ్వరుడు ఆ వైపు కనిపించాడు. మరో వైపు తిప్పితే అక్కడా శంకరుడే. ఆ సర్వేశ్వరుడు సర్వకాల సర్వావస్థల్లోనూ ఉన్నాడు... ఆచారాలు, సంప్రదాయాలకన్నా విశుద్ధ భక్తితోనే భగవంతుణ్ణి చేరగలమని బోధించారు. ఈ కథను చెప్పిన రమణ మహర్షి ఆశ్రమ సిబ్బందిని ఈ కథ ఎందుకు చెప్పానో అర్థమైందా? అని అడిగారు. అర్థమైందంటూ తల ఊపారు. ఈ సృష్టి మొత్తం అణువణువునా భగవంతుడు నిండివున్నాడనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనకు సర్వం అవగతమవుతుందన్నారు మహర్షులవారు.