
మరో వింత విషయం ఏమిటంటే, జగన్నాధుని విగ్రహానికి కానీ, ఆయన సోదరుడు అయినటువంటి బలరాముడు మరియు సోదరి సుభద్ర విగ్రహాలకు కానీ చేతులు, కాళ్లు, పంజాలు ఏమీ ఉండవు. ఇలా లేకపోవడానికి వెనుక ఒక పెద్ద పౌరాణిక చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో విశ్వకర్మ విగ్రహాలను తయారు చేసే వారట, అలా ఓ నాడు జగన్నాధుని, ఆయన సోదరుని, సోదరి విగ్రహాలు ఒక గదిలో తయారు చేస్తున్న సమయంలో ఆ ప్రాంతం యొక్క రాజు గది తలుపులు తెరిచి లోపలికి రావడంతో మధ్యలోనే నిలిపి వేసాడట విశ్వకర్మ. అప్పటికింకా పాదాలు, చేతులు పూర్తి కాలేదట...ఇక అప్పటినుండి అదే ఆచరణ కొనసాగుతోంది.
ఇక ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. సాధారణంగా అన్ని ఆలయాల ఆవరణలో పక్షులు ఎగరడం గుమికూడడం వంటివి చూస్తుంటాం. కానీ పూరి జగన్నాథుని ఆలయం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ దేవాలయంపై నుండి ఒక పక్షి కూడా ఇప్పటివరకు ఎగరడం ఎవరూ చూసింది లేదు. ఈ దేవాలయ ఆవరణలో పక్షులు అసలు ఉండవు. అంతే కాకుండా ఈ దేవాలయానికి పై నుండి విమానాలు సైతం వెళ్లవు ఎందుకంటే ఈ ఆలయానికి అయస్కాంత శక్తి ఉందని చెబుతుంటారు. పూరి జగన్నాథ్ మందిరంపై ఎప్పుడూ ఒక జెండా ఉంటుంది. అయితే ఇది గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. కాని దీని వెనకున్న కారణాలు ఏమిటి అన్న వివరాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఇలా ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.