నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలు, ఇతర బాదరబందీలేవీ లేకుండా ఉన్నాను. ఎక్కడికీ కదలకుండా ఒకచోట కూర్చున్నప్పటికీ తప్పించుకోలేని మాయ ఒకటి నాన్ను బాగా బాధపెట్టుతోంది. నేను నిన్ను మరిచిపోయినప్పటికీ ఆమెను మాత్రం మరిచిపోలేకపోతున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్ను ఆవరించుకొనే ఉంటుంది. హరికి చెందిన ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పెడుతోంది. నావంటి దుర్భలుడైన ఫకీరును నేను.. అలాంటిది నేనెంత? హరి ప్రసన్నుడైనప్పుడు మాత్రమే ఆ మాయ నుంచి తప్పించుకోవడం సాధ్యపడుతుంది. నిరంతర హరి భజన ఒక్కటే దీనికి పరిష్కార మార్గమని షిరిడీ సాయిబాబా చెప్పారు.
సాయి సాయి అని నిరంతరం నన్ను స్మరించినా చాలు
మాయా శక్తిని గురించి బాబా పై విధంగా చెప్పారు. మహాభాగవంతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపాలని, ఉద్ధవుడికి విడమరిచి చెప్పాడు. తన భక్తుల మేలుకోసం బాబా ఇంకా ఏమేం చెప్పారో ఒకసారి చూద్దాం. ఎవరైతే అదృష్టవంతులో.. ఎవరి పాపాలు క్షీణించినవో.. వారే నన్నుభజించటంలో తత్పరులై ఉంటారు. నన్ను పూర్తిగా తెలుసుకుంటారు. ఎల్లప్పుడు సాయి సాయి అని స్మరించుకుంటున్నా చాలు వారిని సప్త సముద్రాలు దాటిస్తాను. నా మాటలను పూర్తిగా నమ్మండి. తప్పక మీకు మేలు జరుగుతుంది. పూజాతంతుతో నాకు ఎటువంటి పనిలేదు. షోడశోపచారాలతోకానీ, అష్టాంగ యోగాలుకానీ నాకు అవసరంలేదు. భక్తి ఎక్కడైతే ఉంటుందో నా నివాసం అక్కడే ఉంటుంది. తనకు పూర్తిగా శరణాగతులైనవారి క్షేమం కోసం సాయిబాబా ఏం చేస్తారో తెలుసుకుందాం.
క్షయవ్యాధితో భీమాజీ పాటిల్
క్షయవ్యాధితో ఉన్న భీమాజీ పాటిల్ 1909లో ఓ భగవంతుడా.. ఇక నీవే నాకు దిక్కు.. నన్ను కాపాడు స్వామీ అంటూ ఆర్తితో ప్రార్థించాడు. తన మిత్రుడు నానాసాహెబ్ చందోర్కర్ సలహా మేరకు షిరిడీ వెళ్లెను. ఈ జబ్బు అనేది వాని గతజన్మలోని పాప ఫలితమని, ఈ విషయంలో తాను జోక్యం చేసుకోదలుచుకోలేదని బాబా స్పష్టంగా చెప్పేశారు. కానీ నాకు నీవు తప్ప వేరెవరూ దిక్కులేదంటూ భీమాజీ శరణు వేడటంతో బాబా మనసు కరిగిపోయింది. మసీదు మెట్లు ఎక్కినవారికి కష్టాలన్నీ తప్పిపోతాయని, ఎటువంటి బాధలున్నప్పటికీ అవన్నీ నిష్క్రమించి సంతోషానికి దారి తీస్తాయని అభయమిచ్చి ఆ వ్యాధిని పూర్తిగా తగ్గించేశారు.