కృష్ణ భగవానుడి లీలలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ కిట్టయ్య చేసే అల్లరి చూస్తే ముచ్చట వేస్తుంది. ఈ రోజు కృష్ణాష్టమి పండగ కాబట్టి ప్రతి ఇంట్లోని సంబరాలుచేస్తారు. కృష్ణాష్టమి పండగ శ్రావణమాసంలో వస్తుంది. ఈ కృష్ణాష్టమిని దేశవిదేశాలల్లోని ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు ప్రతి ఇల్లు కూడా గోపికమ్మలతోను, కన్నయ్యలతోను కోలాహలంగా ఉంటుంది.కులాలకు, మతాలకు తావులేకుండా ప్రతి ఒక్కరు తమ పిల్లలకు గోపికమ్మలు,కన్నయ్యలు వేషం వేస్తారు. కృష్ణాష్టమని రోజున ప్రతి ఇంట్లోను కృష్ణయ్యకు విశేషంగా పూజలు నిర్వహిస్తారు. కృష్ణయ్య ను మనస్ఫూర్తిగా ఎవరు అయితే పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు సుఖ శాంతులు కూడా చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా శ్రీకృష్ణాష్టమి రోజున సంతానలేమితో బాధపడే వారు కిట్టయ్యను భక్తి శ్రద్దలతో పూజిస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని నమ్ముతారు.

మరి కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఎలా పూజించాలి, కృష్ణాష్టమి విశిష్టత ఏంటి అనే విషయాలు ఒకసారి తెలుసుకుందామా., కృష్ణాష్టమి పండగ పర్వదినాన ఉదయాన్నే నిద్రలేచి శుచి శుభ్రంగా తల స్నానం చేసి, ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. .అలాగే ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుని విగ్రహానికి  గోరు వెచ్చని నీటితో అభిషేకం చేసి పూలతో అలంకరించాలి. అనంతరం కన్నయ్యకు పట్టు వస్త్రాలు కట్టి, ఆభరణాలు పెట్టి చక్కగా అలంకరించాలి. తులసీమల వేయడం మాత్రం ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు.ఆ తరువాత కన్నయ్యని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలికి  చిన్న చిన్న పాదముద్రలు వేస్తారు. ఇక పూజా సమయంలో శ్రీ కృష్ణుడికి అటుకులు, వెన్నను నైవేద్యంగా సమర్పించాలి.

అనంతరం ముత్తయిదువులను ఇంటికి పిలిచి వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి. కృష్ణాష్టమి వేడుకల్లో అత్యంత ముఖ్యమైన సంబరం ఉట్టి కొట్టడం. .ఈ సంబరంలో చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరు పాల్గొంటారు. ప్రతి ఇంటికి వెళ్లి మట్టికుండలో పెరుగు, పాలు చిల్లరడబ్బులు సేకరించి వాటిని ఒక ఉట్టి కుండలో పెట్టి ఆతర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆ ఉట్టిని కర్రతో పగలగొట్టడానికికి కిందనుండి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఉట్టిని పగలకొట్టే సమయానికి ఆ తాడును పైకి కిందకి లాగుతూ సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఉట్టికొడుతున్న సమయంలో, రంగులతో పాటు, నీరు పోస్తూ సంతోషంగా సంబరాలు చేసుకుంటారు.అలాగే ఈరోజు శ్రీ కృష్ణుడి గీతాపఠనం చేస్తే చాలా మంచిది. అలాగే శ్రీ కృష్ణాష్టమి రోజు కృష్ణుని స్మరణ కూడా ఎంతోముఖ్యం. అలా కృష్ణుడి ని తలచుకుంటూ కృష్ణాష్టమి రోజు రాత్రిని గడపాలి

మరింత సమాచారం తెలుసుకోండి: