భక్తి తో కూడిన వివరాలతో పాటు శాస్త్రీయ కోణం కూడా ఉంది.. భక్తుల మాటలను వినడానికి భూమిపైకి వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపించడానికి దగ్గరి దారి సముద్రమే కనుక ..అందుకే వినాయకుడు విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. మట్టితో చేసిన వినాయక ప్రతిమలను మాత్రమే ఉపయోగించడం లో కూడా ఒక విశేషం ఉంది.. అది ఏమిటంటే వర్షాల కారణంగా సరస్సులు, కొలనులు అన్ని బురద పూడికతో నిండి ఉంటాయి. ఒండ్రు మట్టి కోసం జలాశయంలో మట్టిని తీయడంవల్ల పూడిక తీసినట్లు అవుతుంది..అప్పుడు నీళ్లు తేట పడతాయి..వినాయకుడి బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటపడతాయి అని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పది రోజులపాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని 11వ రోజున వైభవంగా జల విసర్జనం చేయడంలో కూడా ఒక రహస్యం ఉంది. పంచభూతాత్మకమైన ప్రతి ఒక్క పదార్థం అనగా పంచభూతాల నుండి జనించిన ప్రతి ఒక్కటి జీవ , నిర్జీవ పదార్థం భూమి మీద ఎంత విలాసవంతంగా ,లగ్జరీగా జీవించినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసి పోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన మట్టి వినాయకుడిని చేసి, అంగరంగా వైభవంగా పూజలు చేసి మేళాలు ,తప్పట్లు మధ్య ప్రజల కోలాహలం హడావిడి నడుమ వినాయకుడిని ఊరేగించి చివరికి సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఎంత బాగా బతికినా చివరికి మట్టిలోనే కలిసిపోవాల్సిందే అన్న ఒక్క సారాంశంతో వినాయకుడి నిమజ్జనం చేస్తారు.