
సనాతన సంప్రదాయాలకు పెద్ద పీట వేయాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లో కొత్తమార్పులు చేటుచేసుకుంటున్నాయా ? నిబంధనలను పాలక మండలి సభ్యులు తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారా ? ఇలాంటి ప్రశ్నలెన్నో ప్రస్తతం భక్తుల మదిలో మెదలుతున్నాయి.
గతంలో పాలకమండలిని నియమించే వారు . వారంతా ఒకే సారి ప్రమాణ స్వీకారం చేసేవారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరూ ట్రస్టు బోర్డుకు అధ్యక్షుడిని ఎన్నుకునే వారు. ఇదీ ఇప్పటి వరకు జరుగుతున్న సంప్రదాయం. కాని గత రెండు పాలక మండళ్లలో ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. తాజాగా ఉదంతం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
టిటిడి నూతన ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యునిగా తుడ ఛైర్మన్ డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. దేవస్థానంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో.ధర్మారెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.నూతన సభ్యులు దేవదేవుని దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందజుకున్నారు. తదుపరి అదనపు ఈవో వారికి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.
ఆలయం వెలుపల కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి కృపతో రెండో సారి టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం వచ్చిందన్నారు. ఇది తనకు ఎంతో సంతోషాన్ని కల్గిస్తున్నదన్నారు. సియం.జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. హైందవ ధర్మ సంస్కృతిని, ఆచారాలను కాపాడతామని చెప్పారు. టిటిడి ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తానన్నారు. చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి సూచనలతో ముందుకు సాగుతానని ప్రకటించారు.
అంత వరకూ బాగనే ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో...అంటే వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అందులోని ఒక ట్రస్టీ ఆయన కంటే ముందుగా, అదీ కొద్ది గంటల ముందే ఓ బోర్డు సభ్యురాలు ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వహించారు. చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందుగా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం ఏంటని అప్పటి టిటిడి అధికారులను ప్రశ్నించారు. అంతటితో ఆగక ముఖ్యమంత్రి కార్యలయం దృష్టికి తీసుకువెళ్లి నానా యాగీ చేశారు. ప్రస్తుతం సభ్యులు ఎవరికి నచ్చిన ముహుర్తంలో వారు పదవులు స్వీకరిస్తున్నారు.
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్లు విరాళం
అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్న రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు. విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ రవి ఐకా ఇప్పటి వరకూ టిటిడికి చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు.
ఆరంభమైన గోవిందుని పవిత్రోత్సవాలు
తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం ఏకాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు.