హైదరాబాద్‌ శివార్లలోని రామోజీ ఫిల్మ్‌ సిటీ సమీపంలో మరో యాదాద్రి రూపుదిద్దుకుంటోంది. జాతీయ రహదారి సమీపంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌, తహశీల్దార్‌ ఆఫీసు సమీపంలోని బీసీ కాలనీ సమీపంలోని ఆండాళ్లమ్మ గుట్టపై వెలసిన లక్ష్మీనరసింహా స్వామి ఆలయం కొత్త అందాలు సంతరించుకుంటోంది. ఆలయ నిర్మాత మాచగోని రంగయ్య ఆధ్వర్యంలో.. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత మధ్య ఈ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది.


ఆలయం సమీపంలోనే అలరించే చెరువు.. సమీపంలో చుట్టూ పచ్చటి కొండలు.. మరోవైపు ఎదురుగా రామోజీ ఫిల్మ్‌సిటీ.. ఇలా ప్రకృతి రమణీయత మధ్య కొలువైన శ్రీలక్ష్మీనరసింహా స్వామి భక్తులకు అభయమిస్తూ కనువిందు చేస్తున్నారు. ఈనెల 22న స్వామివారి కల్యాణం జరిపిస్తున్నామని.. భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని  ఆలయ నిర్మాత మాచగోని రంగయ్య తెలిపారు.


వందల ఏళ్ల క్రితమే ఇక్కడ లక్ష్మీనరసింహా స్వామి ఆలయం ఉందని.. దాన్ని తమ తండ్రి మాచగోని సాయిలు గుర్తించి.. చిన్న గుడి కట్టాడని.. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనేది తమ తండ్రి కోరిక అని ఆలయ నిర్మాత  మాచగోని రంగయ్య తెలిపారు. తండ్రి పరమపదించిన నాటి నుంచి ఈ ఆలయ అభివృద్ధే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నట్టు రంగయ్య తెలిపారు. తన శక్తి మేరకు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నానని..గత ఏడాదే విగ్రహ ప్రతిష్ట చేయించానని ఆయన తెలిపారు.


గతంలో ఎగుడు దిగుడుగా ఉండి భక్తులు ఎక్కేందుకు కష్టంగా ఉన్న కొండ ప్రాంతాన్ని  ఆలయ నిర్మాత  మాచగోని రంగయ్య చదును చేయించి.. చక్కటి మార్గం ఏర్పాటు చేయించారు. అలాగే తూర్పు వైపు నుంచి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయించారు. కొండ దిగువన కల్యాణం జరిపించే వేదికను ఏర్పాటు చేయించారు. ఆలయ అభివృద్ధికి తన శక్తిమేర ప్రయత్నిస్తున్నానని.. దాతలు ముందుకు వస్తే మరింతగా అభివృద్ధి చేయవచ్చని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ శివార్లలోనే ఉన్నందున నగరంలోని భక్తులు స్వామివారిని దర్శించుకుని.. ఆయన కృపకు పాత్రులు కావచ్చు. ఉరుకుల పరుగుల నగర జీవితం నుంచి కాస్త సాంత్వన పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: