ఈ కార్తీక మాసంలో, పైగా దీపావళి పండుగ సందర్భంగా దీపారాధనకు విశేషశమైన స్థానం కల్పించింది మన సనాతన సంప్రదాయం. దీపారాధన అంటే శరీరాన్ని, మనసుని... మనసా, వాచా, కర్మణా భగవంతునికి అర్పించి జ్ఞాన జ్యోతిని వెలిగించడమే. దీపావళి పండుగ నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు దీపారాధన చేయడం చాలా పాజిటివ్ ఎనర్జీని సొంతం చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఇక్కడ చాలామందికి దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి ప్రమిదలలో చేయాలి? ఏ రకం ప్రమిదలలో దీపారాధన చేస్తే ఏం ఫలితం వస్తుంది? వంటి సందేహాలు వస్తాయి. అలాంటివారి కోసమే ఈ కధనం!
దీపారాధన చేయడానికి మనం ఒకప్పుడు ఇత్తడి ప్రమిదలను ఎక్కువగా వాడేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఇత్తడి ప్రమిదలలో చేస్తే బంగారు ప్రమిదలలో వెలిగించిన ఫలితం వస్తుందని నమ్మేవారు. ఆయుష్షు కూడా పెరుగుతుందని చెప్పేవారు మన పూర్వీకులు. అదేవిధంగా దీపారాధనను కంచు ప్రమిదలలో చేసినా మంచిదేనని, ఇందులో దీపారాధన చేయడం వల్ల రోగాల బాధలు పోతాయని చెబుతారు. ఇక పంచలోహాలతో తయారు చేసిన ప్రమిదలలో దీపారాధన చేస్తే ఆ కుటుంబానికి సుఖశాంతులు లభిస్తాయని అంటారు. ఇక్కడ "బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు" పంచ లోహాలు కిందికి వస్తాయి అని మీకు తెలిసిందే. ఇక ఆఖరిగా మట్టి ప్రమిదలలో దీపారాధన అయితే అత్యంత శ్రేయస్కరం అని అంటున్నాయి మన శాస్త్రాలు.
ఇక ఇలాంటి ప్రమిదలలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని నమ్ముతారు. అదే విధంగా బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కలిపి ప్రమిదను చేసి కార్తీకమాసంలో శివాలయాలలో ఎక్కువగా దీపారాధన చేసినా ఫలితం దక్కును. అదేవిధంగా కార్తీకమాసంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో తులసికోట దగ్గర దీపారాధన చేస్తే నవగ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి అని చెబుతారు. వెండి ప్రమిదలలో కొంతమంది దీపారాధన చేస్తారు. ఇలా వెండి ప్రమిదలలో దీపారాధన చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని వారి నమ్మకం. ఇక ఈ దీపావళికి మీరు ఎలా దీపారాధన చేస్తారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి!