అనంత విశ్వానికి ఆదిదేవుడు పరమేశ్వరుడు. ఆద్యంతరహితుడు, జ్యోతిస్వరూపుడు అయిన మహేశ్వరుడు కొలువుదీరిన ఆలయాలు గురించి మాట్లాడుకుంటే రోజులు సరిపోవు. భక్తులు ప్రత్యేకంగా శివుడు అంటే ఎంతో నియమ నిష్ఠలతో ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా శివతాండవం అంటే భక్తకోటికి చెప్పలేని ఆనందం. ఈ క్రమంలోనే పరమశివుడు నటరాజు రూపంలో మనకు దర్శనమిస్తాడు. అయితే, పరమేశ్వరుడు స్వయంగా భూమిపై 5 సార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం చెబుతోంది.

శివతాండవమంటే ఏమిటో తెలుసా? ఎర్రటి శిరోజాలతో హిమాద్రిపై పరమేశ్వరుడు చేసే నృత్యమే శివతాండవం అని నానుడి. శివుని డమరుకం నుంచి వెలువడ్డ శబ్దాలే భాషగా మారిందని సనాతన ధర్మం చెబుతోంది. శివతాండవంలో ఉదయించే సూర్యుడు, సముద్రపు ఘోష, గ్రహాల భ్రమణం, ప్రళయకాల ఉరుములు, మెరుపుల ధ్వనులు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక పరమేశ్వరుడికి ఉన్న 4 చేతులు 4 దిక్కులను సూచిస్తాయి. స్వామివారి హస్తాల్లో ఒక దానిలో డమరుకం ఉంటుంది. దీని ద్వారా నాదం వెలువడగా, మరో హస్తం అర్ధచంద్రముద్రలో కనిపిస్తూ జ్వలించే అగ్నిని కలిగి ఉంటుంది. ఇంకో చేయి అభయముద్రలో ఉండి సమస్త ప్రాణికోటికి అభయాన్నిస్తుంది. నాలుగో చేయి స్వామి పాదాలను సూచిస్తుంది. ఆయన చరణాలను నమ్ముకుంటే చాలు రక్షణ లభిస్తుందని అర్థం.

ఇక నటరాజ అంటే నాట్యంతో ప్రకాశించువాడని అర్థం. పరమేశ్వరుడు స్వయంగా భూమిపై 5 సార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో కొలువుదీరాయి. వీటిని పంచక్షేత్రాలంటారు. అందులో మొదటిది "శ్రీ వాద ఆరణ్యేశ్వర్ ఆలయం." శివుడు నాట్యం చేసిన పవిత్రమైన ఆలయాలలో ఇదొకటి. ఈ ఆలయం చెన్నై సమీపంలోని తిరువళన్‌గడులో అనే ప్రాంతంలో కలదు. ఇక్కడ పరమేశ్వరుడు 'కాళితాండవం' చేసినట్టు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.

ఇక రెండవది "నటరాజ ఆలయం." ఇక్కడ పరమేశ్వరుడు విశ్వ నృత్యం చేసినట్టు తెలుస్తోంది. ఈ చారిత్రాత్మక ప్రదేశం చిదంబరంలో కలదు. ఇది దక్షిణ భారతంలోని పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో మహేశ్వరుడు 'ఆనంద తాండవం' చేసినట్టు చెబుతారు.

మూడవది "మీనాక్షి అమ్మవారి టెంపుల్" మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి చాలామందికి తెలుసు. ఈ పవిత్రమైన టెంపుల్లో త్రినేత్రుడు 'సంధ్యా తాండవం' చేసినట్టు ప్రాచీన వాజ్మయం చెబుతోంది.

నాల్గవ ఆలయం "నెల్లైఅప్పార్‌ ఆలయం." తిరునల్వేలిలో ఉన్న నెల్లైఅప్పార్‌ ఆలయంలోని శివుడు ఇక్కడ 'ముని తాండవం' చేసినట్టు చెబుతారు.

ఇక ఐదవ ఆలయం "కుట్రాళనాథర్‌ ఆలయం." అందమైన పట్టణం కుట్రాళంలో ఈ ఆలయం కలదు. శంఖం ఆకారంలో నిర్మించిన కుట్రాళనాథర్‌ ఆలయంలో త్రినేత్రుడు 'త్రిపుర తాండవం' చేసినట్టు పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: