
బీహార్ నుంచి నేపాల్ వరకూ ఈ మిథిలా రాజ్యం ఉందని అంటారు. దీనికే మరో పేరు విదేహ రాజ్యం ... అందుకే సీతమ్మను వైదేహి అంటారు. అప్పట్లో జనకుడు ఉన్న రాజధానే ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్ పూర్ అంటారు. ఈ జనక్ పూర్ లోనే భూమిని దున్నుతుండగా సీతమ్మ తల్లి ఉద్భవించింది. రాముడితో సీతమ్మ తల్లి వివాహం కూడా ఇక్కడే జరిగింది. 1910లో వృషభాను అనే నేపాల్ రాణి ‘ జానకీ మందిర్ ’ పేరుతో అక్కడ వేల గజాల విస్తీర్ణంలో 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో, పాలరాతి గోడలూ, అద్దాల మేడలతో ఓ ఆలయం నిర్మించారు. అప్పట్లోనే ఆ ఆలయానికి రు .. 9 లక్షలు ఖర్చయ్యాయట.
జానకీమందిర్ నిర్మించిన ప్రాంతంలోనే సీతాదేవి శివ ధనుస్సుని పూజించిందని స్థలపురాణం చెపుతుంది. ఈ మండపం లోని నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపం ఉంది. ప్రతి యేటా మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున ఇక్కడ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఆ రోజే సీతారాముల వివాహం జరిగిందని అక్కడి ప్రజల నమ్మకం..అయితే తెలుగువారు శ్రీరామనవమి రోజునే కల్యాణం నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఇక గతంలో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ను సందర్శించు కున్నప్పుడు కూడా ఈ ఆలయాన్ని సందర్శించు కోవడంతో ఇది బాగా పాపులర్ అయ్యింది.