రియో ఒలింపిక్స్ లో ఎట్టకేలకు భారత్ పతకాల పట్టికలో చేరింది. రెజ్లింగ్ లో హర్యానాకు చెందిన సాక్షి మాలిక్ సత్తా చాటి కాంస్య పతకాన్ని గెలవడంతో నిన్నటిదాకా పతకాల పట్టికలో కనిపించని భారత్ పేరు... ఒక్కసారిగా జాబితాలో కనిపించింది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత రెజ్లింగ్ 58 కిలో ప్రీస్టయిల్ విభాగంలో జరిగిన పోటీలో సాక్షి మాలిక్ ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ విజయంతో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తొలి రెజ్లింగ్ క్రీడాకారిణిగా మాలిక్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 



అంతకుముందు ‘రెప్‌చేజ్’ బౌట్‌లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్‌దోర్జ్ (మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో  ఓడిపోయింది. అయితే సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లోవా ఫైనల్‌కు చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు ‘రెప్‌చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది. ఆమె దేశానికి ఒలింపిక్‌ బెర్తు తేవడంలో విఫలమవడమే కాదు.. ఒలింపిక్స్‌ అర్హత పోటీలో క్రమశిక్షణ ఉల్లంఘించి నిషేధానికి గురైంది. 



దీంతో ఒలింపిక్స్‌ ముందు చివరి అర్హత టోర్నీకి గీత స్థానంలో సాక్షికి అవకాశం దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని వృథా కానివ్వని ఆమె ఒలింపిక్‌ బెర్తు సాధించింది. ఇప్పుడు పతకాన్ని తెచ్చి భారతావనిని ఆనందంలో నింపింది.  భారత్‌లో రెజ్లింగ్‌ రాణిగా గుర్తింపు పొందిన గీత.. గాయం లేదంటే మరే కారణాలతోనో అంతర్జాతీయ టోర్నీలకు దూరమైతే.. సాక్షికి అవకాశం దక్కేది. అలాగే రియోకు వెళ్లింది. దూకుడుగా ఆడడం సాక్షి శైలి. ప్రత్యర్థి దాడికి దిగేలోపే.. వారి కాళ్లు పట్టేసి నేర్పుగా కిందకు పడేస్తుంది. ఇప్పుడే అదే దూకుడు ఆమెకు పతకాన్ని అందించింది. 



గీత భారత్‌లో కుస్తీ రాణిగా బిరుదు పొందివుండొచ్చు గానీ.. ఆమె సాధించని ఘనతను అందుకున్న సాక్షినే ఇప్పుడు అందరికి స్ఫూర్తి. అంతేకాకుండా ఒలింపిక్స్ లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగానూ మాలిక్ చరిత్ర సృష్టించింది. మాలిక్ విజయం సాదించిన వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రీడాకారులకు సాక్షి మాలిక్ మార్గదర్శకురాలిగా నిలిచిందని ఆయన తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: