నేడు దాయది దేశంతో భారత్ పోరుకు సిద్దం అయ్యింది..ప్రపంచంలో అందరూ ఈ మ్యాచ్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసియా కప్ మొదలై ఐదు రోజులవుతున్నా కిక్కే లేదని భావిస్తున్న వీక్షకులు ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య బుధవారం మ్యాచ్ జరగనుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో ద్వైపాక్షిక సిరీస్‌లు లేని వేళ.. దాదాపు 15 నెలల తర్వాత ఇరు జట్లూ తలపడనున్నాయి.
అన్ని గ్రూప్ మ్యాచ్లలోకెల్లా ఆసక్తి రేపే పోరు ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. సమ ఉజ్జీల సమరంపై అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. మరోవైపు నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. పాక్ పేస్ అటాక్‌కు, భారత బ్యాట్స్‌మెన్‌కు మధ్య పోరులో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే..ఇప్పుడు భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జా ట్విట్ సంచలనం రేపుతుంది.
తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన సానియా... ‘కొద్ది గంటల్లోనే భారత్, పాక్ మ్యాచ్ ప్రారంభంకాబోతుంది.. ఈ సమయంలో కొందరు ఆకతాయిలు చేసే అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం తాను గర్భవతి..ఆ కామెంట్స్ తో విపరీతమైన ఆలోచనల వల్ల నా ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. అందుకే కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను.. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.. కేవలం ఇది ఒక క్రికెట్ మ్యాచ్.. ఆటను ఆటగానే చూడాలి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. కాగా, ఎనిమిదేళ్ల కిందట పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత్-పాక్ ల మద్య ఎప్పుడు క్రికెట్ పోటీ వచ్చిన సానియా మిర్జాను టార్గెట్ చేస్తూ కొంత మంది వ్యంగంగా ట్విట్ చేస్తున్న విషయం తెలిసిందే.