వచ్చే ఐపీఎల్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయా..?  ఐపీఎల్‌ టీమ్‌లో 11 ప్లేయర్స్‌ కాకుండా.. 15 మంది క్రికెటర్లు బరిలోకి దిగబోతున్నారా...? పొట్టి క్రికెట్‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు బీసీసీఐ రెడీ అయిందంటున్నాయి క్రికెట్‌ వర్గాలు.


క్రికెట్‌ను సరికొత్త పుంతలు తొక్కించే క్రమంలో ఇప్పటికే అనేక ప్రయోగాలు చేయగా, తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి నాంది పలకడానికి బీసీసీఐ సిద్ధమైంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ‌ఐపీఎల్‌ లో పవర్‌ ప్లేయర్‌ అనే ప్రయోగాన్ని సిద్ధం చేసేందుకు కసరత్తులు చేస్తోంది.  ఒక ఆటగాడ్ని జట్టు అవసరాల్ని బట్టి ఏ దశలోనైనా సబ్‌స్టిట్యూట్‌గా ఉపయోగించే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అదే సమయంలో తుది జట్టును ప్రకటించే ముందు 11 మందికి బదులు 15మందికి పెంచాలనే యోచనలో బీసీసీఐ ఉంది. అంటే తుది జట్టులో ఆడేది 11 మందే అయినా మిగతా నలుగుర్ని సబ్‌స్టిట్యూట్‌లగా యూజ్‌ చేసుకోవచ్చు.


ఐపీఎల్‌లో ప్రవేశపెట్టడానికి ముందు ముస్తాక్ అలీ ట్రోఫీలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నప్పుడు ఈ విధానం వల్ల ఇరు జట్లు మంచి ఆటగాళ్లను తీసుకోవచ్చు. అంటే చివర్లో బంతులు తక్కువ.. పరుగులు ఎక్కువగా ఉన్న సమయంలో చివరి బ్యాట్స్‌మన్ వల్ల ఉపయోగం లేదనుకున్నప్పుడు మరో మంచి ఆటగాడిని బ్యాటింగ్ చేస్తున్న జట్టు సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవచ్చు. అలాగే బౌలింగ్ చేసే జట్టు కూడా మంచి బౌలర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవచ్చు. ఫలితంగా మ్యాచ్ మరింత రసవత్తరంగా మారుతుందని బీసీసీఐ భావిస్తోంది.


ఇప్పటికే పింక్‌ బాల్‌ టెస్ట్‌ను పట్టాలెక్కించిన బీసీసీఐ.. ఐపీఎల్‌లో మరింత క్రేజ్‌ తీసుకురావడానికి సై అంటోంది. అందులో భాగంగానే ఈ పవర్‌ ప్లేయర్‌ ఆలోచనకు తెర లేపింది.  దీనిపై  బీసీసీఐ హెడ్‌ క్వార్టర్స్‌లో జరుగనున్న సమావేశంలో ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: