ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ టీ - ట్వంటీ లీగ్ లో సరికొత్త రికార్డ్ నమోదైంది.
అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకి చెందిన ఓపెనర్ షోపీ డివైన్ (85 నాటౌట్: 56 బంతుల్లో 6x4, 5x6) భారీ షాట్లతో విరుచుకుపడి ఒకే ఓవర్ లోనే వరుసగా ఐదు సిక్సర్లు సాధించింది. దీనితో తొలుత బ్యాటింగ్ చేసిన
అడిలైడ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా, ఛేదనలో ప్రత్యర్థి మెల్‌బోర్న్ స్టార్స్ 147/8 పరుగులకే పరిమితమైంది.
మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన
అడిలైడ్ జట్టు 19 ఓవర్లు ముగిసే సమయానికి 133/4 తో నిలవగా ఓపెనర్ డివైన్ 51 బంతుల్లో 55 పరుగులు చేసి క్రీజులో ఉంది. దీనితో మెల్‌బోర్న్ టీమ్ కెప్టెన్ ఆఖరి ఓవర్ ని స్పిన్నర్ మెడిలైన్ పెన్నాతో వేయించింది. కానీ ఆ నిర్ణయమే ఆ జట్టుకి మ్యాచ్ ని అందకుండా చేసింది.
ఇన్నింగ్స్ చివరి ఓవర్ 20 వ ఓవర్ లో తొలి బంతికి సింగిల్ తీసిన కైట్ (5 నాటౌట్) డివైన్ కి స్ట్రైక్ ఇచ్చింది. ఆ తర్వాత ఐదు బంతుల్నీ ఆడిన డివైన్ వరుసగా 6, 6, 6, 6, 6 గా మలిచింది. రెండో బంతిని ఫుల్ టాస్ రూపంలో విసరగా దాన్ని మిడ్‌వికెట్ దిశగా సిక్స్ రూపంలో తరలించిన డివైన్, ఆ తర్వాత బంతిని క్రీజు వెలుపలికి వచ్చి లాంగాన్ లో బౌండరీ లైన్ అవతలకి పంపింది. ఇక మూడో బంతిని మళ్లీ డీప్ మిడ్ వికెట్ దిశగా, చివరి రెండు బంతులని లాంగాన్ దిశగా సిక్సర్లుగా మలిచింది. మొత్తంగా ఆ ఓవర్ లో 31 పరుగుల్ని
అడిలైడ్ స్ట్రైకర్స్ టీమ్ చేసింది. ఒక వేళ తొలి బంతిని కూడా డివైన్ ఆడే అవకాశం ఉండుంటే ఆరు సిక్సర్లు వచ్చి ఉండేవేమో... !