జట్టులో స్టార్ ప్లేయర్లు లేక ఇలా తడబడుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఉండే మహా మహా ప్లేయర్లు అందరూ కూడా ఆర్సిబి టీమ్ లోనే కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకో ఆ జట్టుకు అదృష్టం అసలు కలిసి రావడం లేదు. గత ఏడాది కాస్త పటిష్టంగా కనిపించినప్పటికీ కీలకమైన మ్యాచ్లలో చేతులెత్తేసి మళ్ళీ టైటిల్ రేస్ లో వెనుకబడిపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్ కోసం అయినా పకడ్బందీ ప్లాన్స్ తో బరిలోకి దిగుతుందని అందరూ ఊహించారు.
ఇక వేలంలో మంచి ప్రతిభ గల ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటుందని అనుకున్నారు. వెస్టిండీస్ స్టార్ ఫేసర్ ఆల్జారి జోసెఫ్ కోసం ఏకంగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జట్టులోకి తీసుకుంది బెంగళూరు ఫ్రాంచైజీ. ఇక ఈ విషయంపై అభిమానులు మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బౌలింగ్ లైనప్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న ఆర్సిబి టీం.. మళ్లీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అల్జారి జోసెఫ్ లాంటి బౌలర్ పై అంత పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆర్సిబి ఏకంగా ఫ్యాన్స్ ను నిరాశపరచడమే పనిగా పెట్టుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.