
అయితే అండర్ 19 స్టార్ క్రికెటర్ సచిన్ దాస్ ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో తన అద్భుతమైన ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సచిన్ దాస్ ఆడిన కీలక ఇన్నింగ్స్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ ఉదయ్ సహారన్ తో కలిసి అసాధారణ ప్రతిభ కనపరిచాడు సచిన్ దాస్. ఏకంగా నాలుగు పరుగుల దూరంలో శతకం చేజార్చుకున్నాడు అని చెప్పాలి. ఐదో వికెట్ కు ఏకంగా కెప్టెన్ ఉదయ్ తో కలిసి 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. టీమిండియా విజయానికి బాటలు వేశాడు.
ఈ క్రమంలోనే ఇతని గురించి తెలుసుకునేందుకు భారత క్రికెట్ ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కాగా ఈ యువ కెరటం మహారాష్ట్రలోని బీడ్ లో జన్మించాడు. అతని తండ్రి సంజయ్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టం. ఆయన యూనివర్సిటీ స్థాయి వరకు క్రికెట్ ఆడాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంటే సంజయ్ కి ఎంతో ఇష్టం. అందుకే అతని కొడుకుకి కూడా సచిన్ పేరును పెట్టాడు. కొడుకుని క్రికెటర్ చేయాలని ఎంతో కష్టపడ్డాడు. ఇక ఇప్పుడు సచిన్ అండర్ 19 ప్రపంచకప్ లో అదరగొడుతున్నాడు. కాగా సచిన్ దాస్ తల్లి సురేఖ దాస్ మహారాష్ట్ర పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తుంది. ఆమె మాజీ కబడ్డీ ప్లేయర్ కూడా కావడం గమనార్హం.