ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఉత్కంఠ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇరు దేశాల క్రికెట్ ప్రేరేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను హై వోల్టేజ్ మ్యాచ్ గా కూడా పిలుచుకుంటూ ఉంటారు. అయితే అన్ని దేశాలకు క్రికెట్ జట్లు ఆడినట్లుగా ఇండియా, పాకిస్తాన్ జట్లు ఒక దేశపర్యటనకు మరో దేశం వెళ్లడం అస్సలు జరగదు. క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లు ఈ రెండు జట్లు అసలు ఆడవు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే తలపడుతూ ఉంటాయి.


 అయితే పాకిస్తాన్లో నిర్వహించే ఐసీసీ టోర్నీల విషయంలో కూడా అటు బిసిసిఐ గత కొంతకాలం నుంచి మొండిగానే వ్యవహరిస్తుంది. తాము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్లో అడుగుపెట్టే ప్రసక్తి లేదు అంటూ తేల్చి చెప్పింది. దీంతో గతంలో పాకిస్తాన్లో జరిగిన ఆసియా కప్ విషయంలో కూడా ఇదే జరగగా.. ఏకంగా ఇండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించారు. కాగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అటు పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంటుంది  దీంతో ఇండియా ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ పర్యటనకు వెళ్తుందా లేదా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాము పాకిస్తాన్ కు వెళ్ళబోయే ప్రసక్తే లేదని.. కావాలంటే టోర్ని నుంచి తప్పుకుంటాము అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.


 తమ మ్యాచ్ ల కోసం తటస్థ వేదిక ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా తమ దేశంలోనే నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది. ఇక ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ కు టీమిండియా రాకపోతే.. 2026లో భారత్ శ్రీలంక నిర్వహించే టి20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాలని భావిస్తుందట పాకిస్తాన్. ఈనెల 19 నుంచి 22 వరకు కొలంబోలో జరిగే ఐసిసి వార్షిక సదస్సులో హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలను వ్యతిరేకించనున్నట్లు సమాచారం. మరి దీనిపై ఐసీసీ స్పందన ఎలా ఉండబోతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: