భారత క్రికెట్ జట్టు స్టార్ ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ కు క్రికెట్ పట్ల అభిరుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో ఆడుతున్నాడు. ఇందులో భాగంగా జరిగిన మ్యాచ్‌లో తన సొంత జట్టు ఆటగాడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్. అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దిండిగల్ డ్రాగన్స్ తరఫున ఆడుతున్నాడు. అంతేకాదు జట్టుకు అతడే కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. ఓపెనింగ్ కూడా చేస్తున్నాడు. చెపాక్ సూపర్ గిల్లీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ మంచి ప్రదర్శన చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే అతను తన సహచరులలో ఒకరిపై కోపంతో వార్తల్లో నిలిచాడు. 57 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అశ్విన్ అవుట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతను ఔటైన తర్వాతి బంతికే మరో వికెట్ పడింది. శివమ్ సింగ్, కొత్త బ్యాట్స్‌మెన్ బాబా ఇందర్‌జీత్ మధ్య గందరగోళం ఏర్పడడంతో ఇందర్‌జీత్ మొదటి బంతికే రనౌట్ అయ్యాడు. వరుసగా రెండో వికెట్ పడిపోవడం చూసిన అశ్విన్ కోపాన్ని అదుపు చేసుకోలేక తన సీటుపై నుంచి లేచి ఇద్దరు ఆటగాళ్లపై అరవడం మొదలుపెట్టాడు. అశ్విన్ కు వచ్చిన కోపాన్ని చూసి అతని సహచరులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో అశ్విన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అతని జట్టు దిండిగల్ డ్రాగన్స్ చెపాక్ సూపర్ గిల్లీస్‌ను 6 వికెట్ల నష్టానికి 158 పరుగులకే పరిమితం చేసింది. శివమ్ సింగ్ 49 బంతుల్లో 64 పరుగులు, ఆర్ అశ్విన్ 35 బంతుల్లో 57 పరుగులు చేయడంతో దిండిగల్ డ్రాగన్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: