రోహిత్ శర్మకు మతిమరుపు ఎక్కువ అనే విషయాన్ని ఒక బ్యాటింగ్ కోచ్ బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. మైదానంలోనూ, మైదానం బయటా రోహిత్ గజినీలాగా వ్యవహరిస్తాడట. వాస్తవానికి, రోహిత్‌ లో ఈ అలవాటును ముందుగా గుర్తించింది విరాట్ కోహ్లీ. ఆయన ఈ విషయం గురించి ఒక వీడియోలో చెప్పగా అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు, భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠౌర్ కూడా ఈ విషయాన్ని గుర్తు చేశారు.

కోహ్లీ చెప్పినట్లు, రోహిత్ శర్మ ఐప్యాడ్, వాలెట్, ఫోన్ లాంటి చిన్న చిన్న వస్తువుల నుంచి పాస్‌పోర్ట్ వరకు అతను మర్చిపోతాడు. పాస్‌పోర్ట్ రెండు మూడు సార్లు మర్చిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలాంటి విషయాలు ఒక యూట్యూబ్ షోలో కోహ్లీ చెప్పారు. ఇప్పుడు విక్రమ్ రాఠౌర్ మాట్లాడుతూ.. "రోహిత్ శర్మ గత నెలలో సెలవు నుంచి తిరిగి ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు తన వద్ద ఎన్ని బ్యాగులు ఉన్నాయో తెలియక గందరగోళానికి గురయ్యాడు. అంతకు ముందు, న్యూజీలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ సమయంలో తాను ఏమి బాటింగ్ లేదా బౌలింగ్ లలో ఏం నిర్ణయించుకున్నాడో మర్చిపోయాడు. మరొక మ్యాచ్‌లో, తన జేబులో టాస్ కోసం నాణెం ఉందని మర్చిపోయాడు." అని చెప్పారు.

విక్రమ్ రాఠౌర్ ఒక ఇంటర్వ్యూలో రోహిత్ మతిమరుపు గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు. అయితే ఆట విషయానికి వస్తే మాత్రం రోహిత్ ఎప్పుడూ ఏ విషయాన్ని మర్చిపోడు అని చెప్పారు. "రోహిత్ శర్మ టాస్‌లో బ్యాటింగ్ చేయాలో బౌలింగ్ చేయాలో నిర్ణయించుకోవడం, లేదా టీం బస్సులో తన ఫోన్, ఐప్యాడ్ మర్చిపోవడం చేయొచ్చు, కానీ ఆట ప్రణాళిక మాత్రం ఎప్పుడూ మర్చిపోడు. అందులో అతను చాలా తెలివైనవాడు. రోహిత్ బ్యాట్స్‌మెన్లు, బౌలర్ల కోసం వేర్వేరు వ్యూహాలు నిర్ణయించే టీం మీటింగ్‌లలో చాలా ఆసక్తిగా పాల్గొంటాడు.

"అతను ఆటగాళ్ల కోసం చాలా కష్టపడే కెప్టెన్. టీం మీటింగ్‌లు, వ్యూహాల విషయంలో ఇంతగా పాల్గొనే కెప్టెన్‌ను నేను ఇంతకు ముందు చూడలేదు. అతను టీం వ్యూహంపై చాలా సమయం గడుపుతాడు. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ల మీటింగ్‌లలో కూడా పాల్గొంటాడు. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడానికి వారితో కలిసి కూర్చుంటాడు. ఆటగాళ్లతో చాలా సమయం గడుపుతాడు." అని మాజీ కోచ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: