తాజాగా జై షా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సంస్థకు కొత్త చైర్మన్‌గా సెలెక్ట్ అయ్యారు. గ్రెగ్ బార్క్లే ఈ పదవి నుంచి వెళ్లిపోతున్నారు. జై షా డిసెంబర్ 1 నుంచి ఈ పదవి చేపట్టనున్నారు. భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)లో సెక్రటరీగా ఉన్న జై షాకు ఎవరూ పోటీ చేయలేదు కాబట్టి ఆయన్నే ఏకగ్రీవంగా చైర్మన్‌గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 35వ ఏటనే ఈ పదవి చేపట్టడం వల్ల ఆయన ICC చరిత్రలో అతి చిన్న వయసులో అధ్యక్షుడిగా ఎన్నికైన చైర్మన్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన ఈ పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు., ఆయనకు ఇష్టం ఉంటే మరో మూడు సంవత్సరాలు కూడా కొనసాగవచ్చు. అయితే ఆయన కంటే ముందు ఐసీసీ చైర్మన్‌గా ఎవరెవరు పనిచేశారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆ ఇండియన్స్ ఎవరో మనమూ తెలుసుకుందామా.
జగ్‌మోహన్ దాల్మియా (1997-2000):
భారతీయ క్రికెట్ చరిత్రలో ముఖ్యమైన జగ్‌మోహన్ దాల్మియా నాయకత్వంలో ఇండియన్ క్రికెట్ ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ఆయన బీసీసీఐలో కీలక పాత్రలు పోషించారు. 1997-2000 వరకు ఐసీసీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన పాలనలో, బీసీసీఐ క్రికెట్ మ్యాచ్ స్లాట్‌లను టెలివిజన్ ఛానెళ్లకు ఇవ్వడం ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుంది. క్రికెట్ నుంచి ఆదాయం సంపాదించే దాల్మియా విధానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులను ఆర్థికంగా బలపరిచింది. ఆయన bcci అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుగా మార్చిన క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.
శరద్ పవార్ (2010-2012)
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ncp అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఐసీసీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన 2010-2012 మధ్య అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ని నడిపించారు. దీనికి ముందు ఆయన 2005-2008 మధ్య bcci అధ్యక్షుడిగా ఉన్నారు.
ఎన్. శ్రీనివాసన్ (2014-2015):
భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అధ్యక్షుడిగా పనిచేసిన ఎన్. శ్రీనివాసన్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2014లో ఆయన ICC చైర్మన్‌గా అధికారంలోకి వచ్చి, తన పాలనలో ముఖ్యమైన పరిపాలనా మార్పులను తీసుకువచ్చారు. అత్యంత గమనార్హమైన మార్పు ఏమిటంటే, భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అనే "బిగ్ త్రీ" క్రికెట్ బోర్డులకు ఎక్కువ అధికారాన్ని ఇవ్వడం. అయితే, ఆయన పాలన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బెట్టింగ్ కుంభకోణం కారణంగా వివాదాస్పదంగా మారింది.
శశాంక్ మనోహర్ (2015-2020):
శశాంక్ మనోహర్ రెండుసార్లు bcci అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత 2015 నుంచి 2020 వరకు ICC చైర్మన్‌గా పనిచేశారు. ICC చైర్మన్‌గా, ఆయన ప్రపంచ క్రికెట్ పరిపాలనా నిర్మాణాన్ని మెరుగుపరచడం, "బిగ్ త్రీ" బోర్డుల ఆధిపత్యాన్ని తగ్గించడం లక్ష్యంగా చేసుకుని సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఆయన పాలనలో, అన్ని క్రికెట్ ఆడే దేశాల మధ్య ఆదాయాన్ని సమానంగా పంపిణీ చేయడానికి కూడా ఆయన కృషి చేశారు.