ఈ మధ్యకాలంలో మాత్రం ఏ ఒక్క ఆటగాడు కూడా 40 ఏళ్ళ వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతూ ఉండడం చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. 35 ప్లస్ వయస్సు వచ్చేస్తే చాలు రిటైర్మెంట్ ఆలోచన చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఈ మధ్యకాలంలో ఇలా చాలామంది ఆటగాళ్లు ఇంకోన్నేళ్ల పాటు ఆడతారు అనుకుంటే. సడన్గా రిటైర్మెంట్ ప్రకటన చేసి అభిమానులందరికీ కూడా షాక్ ఇస్తున్నారు. అయితే ఇటీవల టీమిండియా వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్ కూడా ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మలన్ గతంలో ఐసిసి టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కూడా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. 37 ఏళ్ల ఈ స్టార్ ప్లేయర్ ఇంగ్లాండ్ జట్టు తరఫున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 t20 మ్యాచ్ లు ఆడాడు. మూడు ఫార్మాట్ లోను సెంచరీ నమోదు చేసిన ఆటగాడుగా నిలిచాడు. ఇంగ్లాండు జట్టులో పవర్ హిట్టర్ గా ఇతనికి మంచి పేరు ఉంది. కాగా గత వన్డే వరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ జట్టులో చోటు కోల్పోయిన ఈ ఆటగాడు.. మళ్లీ జట్టులోకి రావాలని ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దీంతో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్నది తెలుస్తోంది.