కీర్తి ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. జీవితంలో విజయం సాధించిన వారికి కీర్తి ఆటోమేటిక్ గా వస్తుంది. అప్పటిదాకా వారిని ఎవరు గుర్తించరు, గౌరవించరు కానీ ఒక్కసారి సక్సెస్ సాధించిన తర్వాత అడక్కపోయినా అందరూ గౌరవం ఇస్తారు. గతంలో తిట్టిన వాళ్లే క్షమాపణలు చెప్పేస్తూ స్నేహితుల అవడానికి ప్రయత్నిస్తారు. భారత పారా అథ్లెట్‌ దీప్తి జీవన్‌జీ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.

తెలంగాణలోని వరంగల్‌లోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి పారాలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. కానీ, ఈ పారా-అథ్లెట్‌కు జీవితం ఎప్పుడూ సులభంగా సాగలేదు. కొంతకాలం క్రితం, ఆమె గ్రామస్తులు, పొరుగువారు ఆమెను చూసి ‘కోతి’ అని అనుకరించి హేళన చేశారు. ఆమె శరీరంలోని అనారోగ్యంపై కామెంట్లు చేస్తూ చాలా క్రూరంగా ప్రవర్తించారు.

ఆమె తల్లిదండ్రులు యదగిరి, జీవన్జీ ధనలక్ష్మి చెప్పినట్లు, గ్రామస్తులు తన కూతురిని అనాధాశ్రమంలో వదిలేయమని సలహా ఇచ్చారు. కానీ, పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆమెను అందరూ ఓ గొప్ప క్రీడాకారిణిగా, ఛాంపియన్‌గా గౌరవిస్తున్నారు. ఆమె అద్భుతమైన కథను గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు బహుమతి ఇచ్చి ప్రోత్సహించారు.

తెలంగాణ సీఎం ఆ యువ క్రీడాకారిణికి ప్రభుత్వ ఉద్యోగం (గ్రూప్-2 లెవెల్), కోటి రూపాయల నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇచ్చారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన కోచ్ రమేష్‌కు పది లక్షల రూపాయల బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. తన గ్రామస్తులు తనను 'కోతి' అని పిలుస్తూ అవమానించేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను గుర్తించి ప్రశంసిస్తున్నారు. ఈ యువ క్రీడాకారిణి తన గొప్ప విజయంతో అందరి నోర్లు మోయించింది. అవమానాలకు కృంగిపోకుండా తన సత్తా ఏంటో చూపించి ఎగతాళి చేసిన వారితోనే పొగిడించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: