* వరల్డ్ కప్ విన్నర్ కీర్తి ఆజాద్

* రాజకీయాల్లో కూడా విన్నరే

* ఇప్పటికీ పాలిటిక్స్ లో సక్సెస్ ఫుల్  

సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాదు స్పోర్ట్స్ సెలబ్రెటీలు కూడా రాజకీయాల్లోకి వస్తుంటారు. కొంతమంది సక్సెస్ అవుతుంటే మరి కొంతమంది మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతుంటారు. సక్సెస్ అయిన స్పోర్ట్స్ సెలబ్రిటీలలో టీమిండియా వరల్డ్ కప్ విన్నర్ కూడా ఉన్నారు. ఆ క్రికెటర్ పేరు కీర్తివర్ధన్ భగవత్ జా ఆజాద్. ఈయన మంచి క్రికెట్ ఆటగాడు మాత్రమే కాదు సక్సెస్‌ఫుల్ పొలిటిషియన్ కూడా. కీర్తివర్ధన్ భారత క్రికెట్ జట్టు తరఫున 7 టెస్ట్ మ్యాచ్‌లు, 25 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ఈ మ్యాచ్‌లు ఆయన 1980 నుంచి 1986 మధ్య కాలంలో ఆడాడు. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఆజాద్ కూడా ఉన్నారు. అంటే, ఆయన భారత్‌కు ప్రపంచ కప్‌ని తెచ్చిపెట్టిన టీమ్ లోని ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకరు.

కీర్తివర్ధన్ అలియాస్ కీర్తి బిహార్ మాజీ సీఎం అయిన తన తండ్రి భగవత్ ఝా ఆజాద్‌ బాటలో నడుస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన బీజేపీ టిక్కెట్‌పై బీహార్‌లోని దర్భంగా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. దర్భంగా నుంచి మళ్లీ పోటీ చేసి లోక్‌సభకు రెండవసారి కూడా పనిచేశారు. దీనికి ముందు, ఆయన ఢిల్లీలోని గోలే మార్కెట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దర్భంగా నుంచి కూడా గెలుపొందారు.

2015, డిసెంబర్ 23న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని విమర్శించినందుకు కీర్తివర్ధన్‌ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌లో జైట్లీ అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.  ఆజాద్ 2019 ఫిబ్రవరి 18న భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.  బీజేపీ అభ్యర్థి పశుపతి నాథ్ సింగ్‌తో తలపడి 4.8 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

 2021, నవంబర్‌లో, కీర్తివర్ధన్ 2022 గోవా శాసనసభ ఎన్నికలకు ముందు అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే వరకు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో పనిచేస్తానని చెప్పారు. 2022, మార్చి 5 నుంచి అతను గోవాలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు, మహువా మోయిత్రా నుండి బాధ్యతలు స్వీకరించాడు. ఆజాద్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్-దుర్గాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: