అవును, భారత జట్టును ఎలాగన్నా పాకిస్థాన్‌కు రప్పించాలని పీసీబీ తాజాగా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినట్లు జాతీయ కథనాల్లో వెలువడింది. భద్రతాపరమైన కారణాలను చూపి భరత్ గతంలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు నిరాకరించిన నేపథ్యంలో పాక్ ఈ ఆసక్తికర ప్రతిపాదన చేయడం గమనార్హం. విషయం ఏమిటంటే, మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు పాకిస్థాన్‌లో ఉండకుండా, వెంటనే చండీగర్ లేదా ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని పాక్ బతిమిలాడుతోంది. ప్రయాణ సౌలభ్యం దృష్ట్యా భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లనూ లాహోర్‌లోనే షెడ్యూల్ చేస్తామని కూడా పీసీబీ చెబుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే భారత్‌కు సరిహద్దు నగరంగా లాహోర్ ఉంటుందని, అందువల్ల భారత అభిమానులు మ్యాచ్‌లు చూసేందుకు సౌకర్యవంతంగా కూడా ఉంటుందని పాక్ బోర్డు బీసీసీఐని ఒప్పించే ప్రయత్నంలో పడింది. కాగా పాక్ వేదికగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఇందులో గ్రూప్ స్టేజ్‌లో భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడేలా ముసాయిదా రూపొందించారు. ఇక టోర్నీ మొత్తంగా రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాల్లో జరగనుందని సమాచారం.