ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న 2వ టెస్టులో ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ స్పిన్నర్లు అయినటువంటి నోమాన్ అలీ, సాజిద్ ఖాన్ పాక్ టీములో చేరడంతో దూకుడు మీదున్న పాకిస్థాన్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో 152 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తు కింద ఓడించి పెవిలియన్ పంపించింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌ ఔటైన విధానం నెట్టింట వైరల్‌గా మారింది. అవును, బెన్ స్టోక్స్ వికెట్ చేజార్చుకున్న తీరుని చూసి పాక్ క్రికెట్ అభిమానులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. మరోవైపు ఇంగ్లండ్ అభిమానులు మాత్రం ఈ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

విషయం ఏమిటంటే, సరిగ్గా 28వ ఓవర్‌లో నోమాన్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ ఊహించని రీతిలో వికెట్ కోల్పోవడం చూపరులను అలరిస్తోంది. సాధారణంగా స్వీప్, లేదా రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించే అతడు ఈసారి క్రీజ్ దాటి ముందుకొచ్చి మిడ్ వికెట్ మీదుగా బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నం చేయగా బ్యాలెన్స్ తప్పడంతో బ్యాట్ చేజారి గాల్లోకి ఎగిరి కిందపడింది. దాంతో బెన్ స్టోక్స్ క్షణకాలం పాటు బిత్తరపోయాడు. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న వికెట్ కీపర్ రిజ్వాన్ వెంటనే బంతిని పట్టుకుని స్టంప్స్ కేసి కొట్టి వికెట్ తీసాడు.

36 బంతుల్లో 37 పరుగులతో మంచి ఫాంలో ఉండగా వికెట్ చేజార్చుకున్న స్టోక్స్ చివరకు నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా ఈ ఇన్నింగ్స్‌లో నోమాన్ చెలరేగిపోయాడు. 46 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టీంని మట్టి కరిపించాడు. ఈ మ్యాచ్‌లో రెండు స్పిన్నర్లతో దిగాలన్న వ్యూహం ఫలించడంతో పాక్ అభిమానులు క్రీడాకారులను ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోమన్ అలీ, సాజిద్ ఖాన్‌లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు మరుపురాని విజయాన్ని అందించారు అని పాక్ బోర్డు ప్రకటించింది. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి నుంచి తడబాటుకు లోనైంది. నొమాన్ 11 వికెట్లు, సాజిద్ 9 వికెట్లు పడగొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: