అవును, మీరు ఊహించనిది జరిగింది. భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఖాతాలో చెత్త రికార్డు ఒకటి నమోదు అయింది. విషయం ఏమిటంటే, అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక‌ సార్లు డ‌కౌటైన 6వ భార‌త ఆట‌గాడిగా రోహిత్ శర్మ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్ప‌టివ‌ర‌కు రోహిత్ ఎన్ని సార్లు డకౌట్ అయ్యాడో తెలిస్తే షాక్ అవుతారు. ఏకంగా 34 సార్లు డ‌కౌట‌య్యారు. గురువారం నుంచి న్యూజిలాండ్‌తో పూణేలో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఆయ‌న ఈ చెత్త రికార్డు నెలకొల్పడం దురదృష్టకరం. ఈ క్ర‌మంలో స‌చిన్ టెండూల్క‌ర్ డ‌కౌట్ల (34) రికార్డును రోహిత్ స‌మం చేసినట్లయింది. ఈ జాబితాలో జ‌హీర్ ఖాన్ (43), ఇషాంత్ శ‌ర్మ (40), విరాట్ కోహ్లీ (38), హ‌ర్భ‌జ‌న్ సింగ్ (37), అనిల్ కుంబ్లే (35) ఉన్నారు.

ఇకపోతే, నిన్న‌టి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ తొమ్మిది బంతులను బాగా ఎదుర్కొని, ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరి, అభిమానులకు షాక్ ఇచ్చాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యి, అవుట్ అయ్యాడు. ఇలా టెస్టుల్లో డ‌కౌట్ కావ‌డం రోహిత్‌కి ఇది ఆరోసారి కావడం కొసమెరుపు. పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరుగుతున్న 2వ టెస్టులో టాస్ గెలిచి, మొద‌ట బ్యాటింగ్ చేసిన కివీస్‌ను భార‌త స్పిన్న‌ర్లు బాగానే క‌ట్ట‌డి చేయడం జరిగింది. కేవ‌లం 259 ప‌రుగుల‌కే ఆలౌట్ చేశారు.

వాషింగ్ట‌న్ సుంద‌ర్ 7 వికెట్ల‌తో విజృంభించ‌గా.. అశ్విన్ 3 వికెట్స్ తీసి పర్వాలేదు అనిపించాడు. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టానికి 16 ప‌రుగులు మాత్రమే చేసింది. శుభ్‌మన్ గిల్ (6 బ్యాటింగ్‌ ), యశస్వి జైస్వాల్ (10 బ్యాటింగ్‌) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 243 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే, కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటే ఈ పిచ్ పై అత్యంత భీభత్సం చేసేవాడని అభిప్రాయ పడుతున్నారు. చైనామన్ స్పిన్నర్ కావడంతో స్పిన్ ట్రాక్ పై కుల్దీప్ యాదవ్ ను ఆడటం అంత సులభంగా ఉండదు. అయితే కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టి టీమిండియా పెద్ద తప్పు చేసినట్లే కనిపిస్తుంది అని విశ్లేషకులు మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: