టీమిండియా న్యూజిలాండ్‌తో ఆడిన టెస్టు సిరీస్‌లో 0-3 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ వాంఖడే స్టేడియంలో జరిగింది. న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత జట్టు పూర్తిగా విఫలమైంది. కేవలం 30 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. ఈ సిరీస్ భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. భారత జట్టు ఆటగాళ్ల ప్రదర్శన చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా న్యూజిలాండ్ స్పిన్నర్లు అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టారు. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ ఒక్కడే బాగా ఆడాడు. మిగతా ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు.

ఇండియన్ బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శన చాలా బాధాకరంగా ఉంది. టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు 52. అంటే, ప్రతి ఇన్నింగ్స్‌కు సగటున కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇది రోహిత్ లాంటి స్టార్ బ్యాటర్ల నుంచి ఆశించిన స్కోర్ ఏమాత్రం కాదు. విరాట్ కోహ్లి కూడా బాగా రాణించలేదు. అతను మొత్తం 93 పరుగులు మాత్రమే చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేశాడు, అంతే. మిగతా ఇన్నింగ్స్‌లలో అతను చేసిన పరుగులు చాలా తక్కువ.

శుభ్‌మన్ గిల్ మొదటి మ్యాచ్‌ను మిస్ అయ్యాడు. కానీ తర్వాతి రెండు మ్యాచ్‌లలో 144 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేసి బాగా ఆడారు. కానీ తర్వాతి ఇన్నింగ్స్‌లలో కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 171 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ మిగతా ఆటగాళ్ల కంటే బాగా ఆడాడు. అతను ఒక హాఫ్ సెంచరీతో కలిపి మొత్తం 190 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో బాగా ఆడిన ఆటగాడు రిషభ్ పంత్. అతను మొత్తం 261 పరుగులు చేశాడు. అంటే, ప్రతి ఇన్నింగ్స్‌కు సగటున 43.5 పరుగులు చేశాడు. భారత జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఇతనే.

కేఎల్ రాహుల్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. అతను కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు అతన్ని జట్టులోకి తీసుకోలేదు. 2012 తర్వాత మొదటిసారిగా భారత జట్టు సొంత గడ్డపై టెస్టు సిరీస్ ఓడిపోయింది. ఈ ఓటమి వల్ల వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడం కష్టంగా మారింది. త్వరలో ఆస్ట్రేలియాతో వారి సొంత దేశంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడాలి. అది ఐదు టెస్టు మ్యాచ్‌. ఈ పోటీలో నిలబడాలంటే భారత జట్టు పుంజు కోవాలి. అంతగడ్డ పైనే మనోళ్ళు సరిగా ఆడటం లేదు అలాంటిది ఆసిస్ హోం గ్రౌండ్ లో ఇండియన్ బ్యాటర్లు రాణించగలరా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

ఇటీవల టెస్ట్ లో రోహిత్ 11 పరుగులు, జైస్వాల్ 5 పరుగులు, కోహ్లి, గిల్, సర్ఫరాజ్ అందరూ కేవలం 1 పరుగు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లు వేసిన బంతులను ఎదుర్కోవడంలో వీరందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల చేతిలో మనోళ్లు ఇంకా ఎంత ఇబ్బంది పడతారో చూడాలి. BGT గురించి వీళ్లకసలు గుర్తుందా? అని చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. వీళ్లు చేసేది అసలు బ్యాటింగ్ ఏనా అని కూడా తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: